● ఐపీ మైదానానికి టెండర్ల భయం ● ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేటు పెత్తనం ● నిరుపేద క్రీడాకారులు ఆటలకు దూరమయ్యే అవకాశం ● ఇప్పటికే వసతులు లేక అవస్థలు | - | Sakshi
Sakshi News home page

● ఐపీ మైదానానికి టెండర్ల భయం ● ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేటు పెత్తనం ● నిరుపేద క్రీడాకారులు ఆటలకు దూరమయ్యే అవకాశం ● ఇప్పటికే వసతులు లేక అవస్థలు

May 19 2025 2:38 AM | Updated on May 19 2025 2:38 AM

● ఐపీ మైదానానికి టెండర్ల భయం ● ప్రభుత్వ ఆస్తులపై ప్రైవే

● ఐపీ మైదానానికి టెండర్ల భయం ● ప్రభుత్వ ఆస్తులపై ప్రైవే

ఆదిలాబాద్‌: అసలే అరకొర వసతులు.. క్రీడా శిక్షకులు సైతం లేరు.. పర్యవేక్షణ కూడా అంతంతే.. వీటికి తోడు క్రీడాకారులను మైదానానికి దూరం చేసేలా అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఆటలు ఆడాలన్నా, వ్యాయామ సాధన చేయాలన్నా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని(ఐపీ) స్టేడియమే పెద్దదిక్కుగా నిలుస్తోంది. అయితే దీనిని నెమ్మదిగా ప్రైవేట్‌ పరం చేసేందుకు యువజన క్రీడా శాఖ చర్యలు క్రీడాకారులకు శరాఘాతంగా మారుతుంది. ఇప్పటికే స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వహణను కాంట్రాక్టర్‌ కు అప్పగించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. రాబోయే రోజుల్లో స్టేడియంలో పేఅండ్‌ప్లే విధానం అమలుకు అధికారులు చేస్తున్న కసరత్తు క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది.

గతమెంతో ఘనం..

ఈ స్టేడియం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిభగల క్రీడాకారులకు నెలవుగా మారింది. ఎంతోమంది రాష్ట్ర జాతీయ స్థాయి వేదికల్లో మెరిసి ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సాధించారు. పలు క్రీడాంశాల్లో నిరంతరం శిక్షణ ఇచ్చేవారు. జిల్లా కేంద్రం నుంచే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం క్రీడాకారులు వచ్చి తర్ఫీదు పొందేవారు. పలు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించిన చరిత్ర స్టేడియానికి ఉంది. అయితే ఇదంతా గతం.. దశాబ్ద కాలంగా ఈ మైదానంలో క్రీడా శిక్షణలు లేకపోవడంతో ఎంతోమంది ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాక కనుమరుగైపోతున్నారు. ఆడాలనే అభిలాష ఉన్నా సరైన వసతులు లేక క్రీడల్లో రాణించలేని పరిస్థితి.

శిక్షణకు మంగళం..

గతంలో మైదానంలో కబడ్డీ, వాలీబాల్‌, జూడో, హాకీ, ఖోఖో వంటి క్రీడల్లో శిక్షణ అందించేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు ఒక్క శిక్షకుడు లేకపోవడం గమనార్హం. స్టేడియంలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు రెజ్లింగ్‌, బాక్సింగ్‌, జూడో, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడలకు శిక్షకులను నియమించింది. అయితే క్రీడల్లో రాణించాలనే ఔత్సాహికులకు కోచ్‌లు లేకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది.

ఆదాయమే పరమావధిగా..

స్టేడియం నిర్వహణలో భాగంగా కాంట్రాక్టర్‌కు స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వహణ అప్పజెప్పినట్లు అధి కారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు సంబంధించిన అభివృద్ధి దాఖలాలేవి కనిపించట్లేదు. గతంలో లీజుకు ఇచ్చిన సమయంలో స్టేడియంలో ఆశించదగ్గ ప్రగతి జరిగిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికీ స్టేడియానికి దుకాణ సముదాయాలతో ఆదాయం లభిస్తుంది. అయినప్పటికీ స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వహణను ప్రైవేటుపరం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో విఫలయత్నం..

ఐపీ స్టేడియంలో పే అండ్‌ ప్లే విధానాన్ని గతంలో అందుబాటులోకి తీసుకోవచ్చారు. నిర్ణీత ఫీజు చెల్లించిన వారికి మాత్రమే మైదానంలోకి అనుమతించారు. అయితే క్రీడాకారులు, క్రీడా సంఘాల నుంచి విమర్శలు, పలువురు అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో వెనక్కి తగ్గారు. అంతేకాకుండా క్రీడాకారులు, వ్యాయామ సాధకులు విముఖత ప్రదర్శించడంతో డీఎస్‌ఏ అధికారులు తలొగ్గక తప్పలేదు.తాజాగా మళ్లీ అదే ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది.

స్విమ్మింగ్‌పూల్‌ కాంట్రాక్టర్‌ చేతిలోకి..

జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఒకే ఒక్క స్విమ్మింగ్‌ పూల్‌ స్టేడియంలోనే ఉంది. అయి తే కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దీని నిర్వహణను రూ. 21లక్షలకు అద్దె ప్రాతిపదికన అప్పగించారు. గతంలో లీజులో కొనసాగిన సమయంలో నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగిందనే విమర్శలున్నాయి. తాజాగా మున్సిపల్‌ ఆధ్వర్యంలో లీజు విధానానికి సైతం స్వస్తి పలికి టెండర్‌ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.

అవకాశం ఉంటే ప్రయత్నిస్తాం..

స్టేడియం నిర్వహణ, అభివృద్ధి కోసమే స్విమ్మింగ్‌ పూల్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించడం జరిగింది. ప్రస్తుతమైతే స్టేడియంలో మరిన్ని అంశాలు, స్థలాలు టెండర్‌కు ఇచ్చే ప్రతిపాదనలైతే ఏమీ లేవు. ఏవైనా ప్రతిపాదనలో ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ దిశగా కృషి చేస్తాం. నిర్వహణకు సంబంధించి అవకాశం ఉంటే ప్రయత్నిస్తాం.

– వెంకటేశ్వర్లు, డీవైఎస్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement