
గొర్రెల మందపై కుక్కల దాడి
సోన్: మండలంలోని కడ్తాల్ గ్రామంలో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాధితుడు అరిగెల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం వెంకటేశ్ తన గొర్రెలను మేత కోసం బయటకు తీసుకెళ్లాడు. కొన్నింటిని ఇంటి సమీపంలోని షెడ్డులో ఉంచాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒక్కసారిగా వీధి కుక్కలు మందలోకి చొరబడి గొర్రెలపై దాడి చేయగా ఆరు జీవాలు మృత్యువాతపడ్డాయి. సుమారు రూ.35 వేల నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. రెండు నెలలుగా గొర్రెల మందలపై వీధి కుక్కలు దాడి చేయగా సుమారు 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామంలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలను అరికట్టాలని గతంలో అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా వీధి కుక్కల బెడదను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కడ్తాల్‌లో మృతి చెందిన గొర్రెలు