RTC privatization
-
ఆర్టీసీ మనుగడను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు
-
ఆర్టీసీ.. ప్రై‘వేటు’!
సాక్షి, అమరావతి: ప్రగతి రథ చక్రం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రైవేటుపరం చేసే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం పదును పెడుతోందని తేటతెల్లమైంది. విద్యుత్ బస్సుల ముసుగులో తన కుతంత్రాన్ని మరింత వేగవంతం చేసింది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని దొంగదెబ్బ తీస్తోంది. మొదటగా 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. మరోవైపు ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుండటం పట్ల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ముసుగు తొలగించి తమ పన్నాగాన్ని బహిర్గతం చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ అసలు విషయం చల్లగా వినిపించారు. తద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణ తథ్యం అని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఆయువు తీసేందుకు పావులు కదపడం మొదలు పెట్టింది. వంద శాతం విద్యుత్ బస్సుల (ఈ–బస్సులు) విధానం ముసుగులో పక్కా పన్నాగం పన్నింది. కానీ ఈ–బస్సులను ఆర్టీసీ నిర్వహించవచ్చన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని తిరస్కరించింది. కార్పొరేట్ సంస్థల ద్వారానే ఈ–బస్సులు ప్రవేశ పెట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉద్యోగుల సంఖ్యలో కోత విధించవచ్చని కూడా ప్రకటించింది. గత ఏడాది నవంబరులో సీఎం చంద్రబాబు సమక్షంలోనే నిర్వహించిన సమీక్షలో ఆ మేరకు ఆర్టీసీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగులేఆర్టీసీలో ప్రస్తుతం 11,116 బస్సులు ఉన్నాయి. 2029 నాటికి ఆర్టీసీలో వంద శాతం ఈ–బస్సులే ఉండాలనే విధానానికి ప్రభుత్వం 2024 నవంబర్‌లో ఆమోదించింది. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 100 ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులను ప్రవేశ పెడతామని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. అంటే ఈ–బస్సుల ముసుగులో పూర్తిగా ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలన్నది ప్రభుత్వ పన్నాగమన్నది సుస్పష్టమవుతోంది. ఆర్టీసీ వేలుతోనే ఆ సంస్థ కన్ను పొడిచే పన్నాగాన్ని చంద్రబాబు సర్కారు అమలు చేస్తోంది. ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఆ సంస్థ ఉన్నతాధికారుల ద్వారానే నివేదిక ఇప్పించుకోవడం గమనార్హం. 50 శాతం ఈ–బస్సులను ప్రవేశ పెట్టేందుకే అవసమైన వ్యయాన్ని భరించలేమని ఆర్టీసీ ఉన్నతాధికారులే నివేదిక ఇచ్చేలా కుట్ర పన్నింది. అనంతరం ఆ నివేదికను చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమోదించారు. ఆ నివేదిక ప్రకారం 50 శాతం ఈ–బస్సులకు అవసరమైన రూ.8,243 కోట్ల మూల ధన వ్యయంతోపాటు ప్రతి నెల రూ.336 కోట్ల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదని తేల్చి చెప్పేశారు. కాబట్టి విద్యుత్ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. 50 శాతం బస్సులే నిర్వహించలేమని తేల్చి చెప్పిన ప్రభుత్వం.. మరోవైపు ఆర్టీసీలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులు ప్రవేశపెడతామని ప్రకటించింది. అంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తామని తేల్చి చెప్పింది. రూ.6 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటుకు..ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో 12 డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నెముకకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలో అత్యంత విలువైన ప్రదేశాల్లో ఉన్న డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆయా ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ రూ.50 కోట్లు లెక్కన వేసుకున్నా, ఆ 12 డిపోల మార్కెట్ విలువ ఏకంగా రూ.6 వేల కోట్లు! పక్కా కుతంత్రంతో ఆర్టీసీ నిర్వీర్యం⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా కుతంత్రంతో పావులు కదుపుతోంది. అందుకోసం ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ‘ప్రధానమంత్రి ఈ–బస్ సేవా’ పథకం కింద ప్రవేశపెట్టే ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆర్టీసీ కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయడం లేదు. ⇒ గత ఆరు నెలల్లోనే కాలం చెల్లిన 264 బస్సులను ఇటీవల సర్వీసుల నుంచి తొలగించారు. కానీ వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనే లేదు. మరో 2 వేల బస్సులు 15 ఏళ్ల కాల పరిమితి దాటిపోయాయి. ఆ డొక్కు బస్సులనే కొనసాగిస్తోంది. సగటున రోజుకు ఒక బస్సును సర్వీసు నుంచి తొలగిస్తోంది. కానీ కొత్తగా కొనుగోలు చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేస్తోంది. తద్వారా ఆర్టీసీలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–బస్సులను ప్రవేశపెట్టాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేస్తోంది. ⇒ ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తోంది. ఏడాదిలో 617 మంది డ్రైవర్లు, 821 మంది కండక్టర్లు రిటైరయ్యారు. అంటే 1,438 పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం ఆర్టీసీలో దాదాపు 8 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే ఆ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశమేలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అందుకే జాబ్ కాలండర్లో ఆర్టీసీలో ఉద్యోగాల ఊసే ఎత్త లేదు. ⇒ 2029 నాటికి ఆర్టీసీలో 50 శాతం పోస్టులు ఖాళీ అవుతాయి. దాంతో ఆర్టీసీని మూసివేయవచ్చన్నది బాబు ప్రభుత్వ కుతంత్రంగా ఉందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం బరితెగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీకి స్వర్ణ యుగంఆర్టీసీ అభివృద్ధి, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా.. వైఎస్ జగన్ ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక కలను సాకారం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. విలీనం వద్దు అని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినా సరే, వైఎస్ జగన్ మాత్రం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అమలులోకి వచ్చింది. ఫలితంగా ఉద్యోగులకు ప్రతి నెలా జీతాల కోసం ప్రభుత్వం రూ.360 కోట్లు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఆర్టీసీ ఆర్థిక కష్టాలు తీరాయి. దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ఆర్టీసీ ప్రతి నెలా బ్యాంకుల నుంచి అప్పులు చేస్తూ వచ్చింది. ఆ ఆర్థిక ఇబ్బందులను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. 2020లో ఆర్టీసీకి ఉన్న రూ.8 వేల కోట్ల అప్పుల్లో 2024 నాటికి రూ.5 వేల కోట్లు అప్పు చెల్లించింది. 220 కొత్త బస్సులు కొనుగోలు చేసింది. మరో 1,500 బస్సులను రీ–మోడలింగ్ చేసింది. దాంతో ఆర్టీసీ ప్రగతి బాట పట్టింది. ఉద్యోగుల అలవెన్సులను ప్రతి నెలా జీతాలతో పాటు చెల్లించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విధంగా అటు ఆర్టీసీ అభివృద్ధి, ఇటు ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యదిక ప్రాధాన్యం ఇచ్చిందని, అది ఆర్టీసీకి స్వర్ణ యుగమని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేసుకుంటున్నారు. -
‘రూట్ల ప్రైవేటీకరణ’పై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 5,100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలని మంత్రివర్గం చేసిన తీర్మానంపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని, మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తేయాలని ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. స్టే ఉత్తర్వుల వల్ల కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తర్వాత ప్రక్రియ చేపట్టేందుకు వీలు లేకుండా పోయిందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. స్టే రద్దు చేయాలన్న వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం తిరస్కరించింది. మోటారు వాహ న చట్టంలోని 102 సెక్షన్ ప్రకారం ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుం దని, ఇప్పటికిప్పుడే సులభంగా చేసేది కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ తీర్మానం చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా హిత వ్యాజ్యంపై విచారణను 22వ తేదీ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించిం ది. అప్పటివరకు స్టే ఉత్తర్వులు అమలును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఆర్టీసీకి సమాతరంగా ప్రైవేటు రూట్లకు అనుమతినివ్వాలని మంత్రివర్గ తీర్మానం చేయడం ప్రాథమిక దశలోని వ్యవహారమని, ఆ నిర్ణయానికి చట్టబద్ధత తెచ్చేందుకు ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుందని, ఇప్పుడే పిల్ దాఖలు చేయడం అపరిపక్వతే అవుతుందని వ్యాఖ్యానించింది. సహజ వనరుల వ్యవహారమా? సహజ వనరులను ప్రైవేటీకరణ చేసేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు రిలయన్స్, టూజీ కేసుల్లో చెప్పిం దని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభా కర్ చేసిన వాదనలు ఈ కేసుకు వర్తించవని కోర్టు చెప్పింది. సెక్షన్ 102 ప్రకారం ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు గ్యారేజీలకు రాష్ట్రాలకు కేంద్రమే అనుమతినిచ్చిందని గుర్తుచేసింది. రోడ్ల ప్రైవేటీకరణ సహజ వనరులుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటు ఆపరేటర్లకు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయిస్తున్నట్లు ఆర్టీసీ, ప్రభుత్వం చెబుతుంటే, ఆర్టీసీ ఆస్తులనే ప్రైవేటుకు ఇచ్చేస్తారనే భయం ఏమైనా పట్టుకుందా? అనే సందేహాన్ని ధర్మాసనం లేవనెత్తింది. సమ్మెను అడ్డంపెట్టుకుని బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని విశ్వాసరాహిత్యానికి పా ల్పడే చర్యగా పరిగణించాలని న్యాయవాది కోరా రు. నేరుగా చేయలేని దానిని పరోక్షంగా కూడా చేయకూడదు.. అని ఏనాడో సుప్రీంకోర్టు చెప్పిం దని గుర్తు చేశారు. సెక్షన్ 67, 67, 102, చాప్టర్ 5, 6ల్లోని అంశాలపై సాంకేతికపర వివరాల్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చాప్టర్ 5, 6లు పరస్పర విరుద్ధంగా ఏమీ లేవని ధర్మాసనం చెప్పింది. ఈ దశలో వ్యాజ్యం చెల్లదు: ఏజీ ఏజీ వాదిస్తూ.. పిల్ దాఖలుపై ప్రాథమికంగానే ప్రభుత్వానికి తీవ్ర అభ్యంతరాలున్నాయని చెప్పా రు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ విషయాన్ని ఆర్టీసీ పరిశీలించాలని మాత్రమే కేబినెట్ తీర్మానం చేసిం దని, ఈ దశలోనే పిల్ దాఖలు చేయడం చెల్లదన్నారు. ఆర్టీసీ అమలు చేసే రవాణా విధానాలను మార్పులు, చేర్పులు చేసేందుకు 102 సెక్షన్ వీలు కల్పిస్తోందని, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణల ద్వారానే రాష్ట్రాలకు ప్రైవేటు రూట్లకు అనుమతినిచ్చే సర్వాధికారాలు సిద్ధించాయని తెలిపారు. కేబినెట్ నిర్ణయం పూర్తి రూపుదాల్చలేదని, ఆ తీర్మానంపై గవర్నర్ ఆమోదముద్ర వేశాక జీవో జారీ అయితేనే చట్టబద్ధత వస్తుందని, అప్పుడు ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుంటుందని ఏజీ వాదించారు. ఇప్పుడు గవర్నర్ మాత్రమే సమీక్ష చేయాలా? దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపాకే న్యాయ సమీక్ష చేయాలని అంటున్నారా.. ఇప్పుడు గవర్నరే సమీ క్షచేయాలా.. అని ప్రశ్నించింది. ఉత్తరాంచల్ హైకో ర్టు కేసులో రెండు ప్రభుత్వ శాఖల మధ్య జరిగిన లావాదేవీలను న్యాయ సమీక్ష చేయరాదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, ఇక్కడ కేబినెట్ తీసుకున్న నిర్ణయం రెండు శాఖల మధ్య లావాదేవీలుగా ఎలా పరిగణించాలో చెప్పాలని కోరింది. తిరిగి ఏజీ వాదనలు కొనసాగిస్తూ.. కేరళలో నలుగురు జడ్జీల నియామక విషయంలో వారి పేర్లను మంత్రివర్గం గవర్నర్‌కు సిఫార్సు చేసే దశలోనే కోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని, ఈ తీర్పు ప్రకారం రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ అపోహలతో హైకోర్టును ఆశ్రయించారని, పిల్‌ను తోసిపుచ్చాలని కోరారు. స్టే ఎత్తివేసి మంత్రివర్గం తీర్మానంపై తదుపరి చర్యలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించగా, ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని, అదే రోజున ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్‌ను కూడా విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు: సీఎస్ ఆర్టీసీ సమ్మె వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున యూనియన్ నేతలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై న్యాయ సమీక్ష చేసేందుకు ఆస్కారం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హైకో ర్టుకు తెలియజేశారు. ఆర్టీసీ యూనియన్‌తో ప్రభుత్వం చర్చలు జరిపేలా ఉత్తర్వులివ్వాలని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవాలని విశ్వేశ్వరరావు దాఖలు చేసిన మరో పిల్లో హైకోర్టు ఆదేశాల మేరకు సీఎస్ కౌం టర్ దాఖలు చేశారు. ఆర్టీసీ సమ్మెపై లేబర్ కోర్టు తేల్చాలని, పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 10 కింది కార్మికశాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకోవాలని ఇదే హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. వేర్వేరు కారణాలతో కార్మికులు చనిపోతే ఆర్టీసీ సమ్మె కారణంగా చనిపోయారని పిల్లో ఆరోపించా రని చెప్పారు. సమ్మె–చర్చలు వంటి అంశాలపై ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా 2 వారాల్లో కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
ప్రభుత్వ వైఖరి వల్లే ఆర్టీసీకి నష్టాలు
నెల్లూరు (దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్లే ఆర్టీసీ నష్టాల బాటలో పయనిస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఆరోపించారు. ఆర్టీసీని రక్షించాలని కోరుతూ బస్టాండ్‌లో సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద బాకీపడ్డ రూ.2 వేల కోట్లను విడుదల చేయాలన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలన్నారు. ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా వల్ల ఆర్టీసీ రూ.వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతుందన్నారు. సమ్మె సన్నాహక యాత్రలో భాగంగా తిరుపతి రీజియన్ కార్మికులు మంగళవారం అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తారన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈనెల 11 నుంచి నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఈయూ అదనపు ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. ఆర్టీసీ పరిరక్షణకు తలపెట్టిన సమ్మెకు ఉద్యోగులు, కార్మికులు, అధికారులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్రమణ్యంరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్, నెల్లూరు జోన్ అధ్యక్ష, కార్యదర్శులు మహబూబ్, శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు -1 డిపో అధ్యక్ష, కార్యదర్శులు బాషా, వెంకటేశ్వర్లు, 2డిపో అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, ప్రసాద్ పాల్గొన్నారు.


