ఆర్టీసీ ప్రైవేటీకరణకే ప్రభుత్వం పంతం | AP government of planning RTC depot privatisatio | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రైవేటీకరణకే ప్రభుత్వం పంతం

Jul 7 2026 5:33 AM | Updated on Jul 7 2026 5:33 AM

AP government of planning RTC depot privatisatio

తేల్చి చెప్పిన ఆర్టీసీ ఎండీ బాలసుబ్రమణ్యం.. ఆర్టీసీ జేఏసీతో చర్చలు విఫలం

కార్మీకుల ప్రధాన డిమాండ్లను తిరస్కరించిన బాబు సర్కారు 

ప్రైవేటీకరణ వ్యతిరేక డిమాండ్లను పరిశీలిస్తామని కూడా చెప్పని ఎండీ

ఉద్యోగుల సర్వీసుపై డిమాండ్లను సర్కారు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడి 

ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ ప్రకటన

సాక్షి, అమరావతి: ఇ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీ ప్రైవేటీకరణకే కట్టుబడి ఉంటామని చంద్రబాబు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకొనేందుకు ఉద్యమిస్తున్న ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)కి ఈ మేరకు స్పష్టం చేసింది. దాంతో ప్రభుత్వంతో జేఏసీ చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ ఎండీ ఎన్‌.బాలసుబ్రమణ్యంతో జేఏసీ ప్రతినిధులు విజయవాడ బస్‌ భవన్‌లో సోమవారం సమావేశమయ్యా­రు.

గతంలోనే సమర్పించిన పలు డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రంపై చర్చించారు. జేఏసీ ప్రధానంగా లేవనెత్తిన డిమాండ్లను కూడా ప్రభు­త్వం తిరస్కరించడం గమనార్హం. కేవలం ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన సమస్యలను.. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మాత్రమే ఎండీ బాలసుబ్రమణ్యం చెప్పారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జేఏసీ లేవనెత్తిన ఏ డిమాండ్‌ను పరిశీలిస్తామని కూడా ఆయన చెప్పకపోవడం గమనార్హం. ఇ–బస్సులను ప్రైవే­టు సంస్థల ద్వారానే నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న విధాన నిర్ణయమని ఎండీ తేల్చిచెప్పారు.

డిపోలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం, ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా ఇతరత్రా నిర్ణయాలు కూడా అందులో భాగమేనన్నారు. దాంతో ఆర్టీసీ ప్రైవేటీకరణకే టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పరోక్షంగానైనా స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు, కో కన్వీనర్లు పి.వి.రమణా రెడ్డి, జీవీ నరసయ్య, సీహెచ్‌. సుందరయ్య, ఎస్‌.కె. జిలానీ, ఎస్‌వీ శేషగిరిరావు, కె.సూర్యప్రకాశ రావు, డి. మాల్యాద్రితోపాటు ఎన్‌ఎంయూఏ, ఈయూ నేతలు కె.శ్రీనివాసరాజు,  ఎస్‌.రాజేశ్, కుమార్, పి. సుబ్రమణ్యంరాజు, ఎండీ ప్రసాద్, వైఎస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

తిరస్కరించిన ప్రధాన డిమాండ్లు ఇవీ
ఇ–బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా కాకుండా ఆర్టీసీనే స్వయంగా నిర్వహించాలి 
ఇ–బస్సుల కోసం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు మూసివేసిన విజయవాడ విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2 డిపోలను వెంటనే తెరవాలి. 
ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన 8 డిపోలతోపాటు మిగిలిన డిపోలను కూడా ప్రైవేటు సంస్థలకు కేటాయించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

  స్త్రీ శక్తి పథకం నిధులను ఆర్టీసీకి ప్రతి నెలా పూర్తిగా రీఎంబర్స్‌ చేయాలి.
 ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. 
కొత్త బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేయాలి

పరిశీలిస్తామని చెప్పిన డిమాండ్లు
అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపు 
ఆర్టీసీ సిబ్బందికి పదోన్నతులు 
రిటైర్డ్‌ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల బకాయిల చెల్లింపు 
ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌

ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమం ఇక ఉధృతం 
ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. మంగళ, బుధవారాల్లో ఆర్టీసీ పరిరక్షణ దినం పేరుతో ఆందోళన నిర్వహిస్తాం. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.  – ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement