కార్పొరేట్‌కు ధారాదత్తం చేసేందుకు పక్కా కుట్రతో ఆర్టీసీ నిర్వీర్యం
ఈ–బస్సుల విధానం ముసుగులో కుతంత్రం.. 2024లోనే కుట్రకు తెరతీసిన సీఎం చంద్రబాబు
ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న డిమాండ్ బేఖాతరు
కుట్రలో భాగంగా కొత్త బస్సుల కొనుగోలు నిలిపివేత
మరోవైపు కొత్త పోస్టుల భర్తీ లేదని తేల్చి చెప్పిన వైనం..
తొలగించిన సర్వీసుల స్థానంలో కొత్త బస్సులు నిల్
ఇప్పటికే 12 డిపోలు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన సర్కారు
ఈ క్రమంలో ప్రైవేటీకరణ తప్పదని తేల్చిచెప్పిన ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల
ఉద్యోగ సంఘాల డిమాండ్లు బేఖాతరు చేస్తూ వేగంగా అడుగులు
సాక్షి, అమరావతి: ప్రగతి రథ చక్రం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రైవేటుపరం చేసే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం పదును పెడుతోందని తేటతెల్లమైంది. విద్యుత్ బస్సుల ముసుగులో తన కుతంత్రాన్ని మరింత వేగవంతం చేసింది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని దొంగదెబ్బ తీస్తోంది. మొదటగా 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. మరోవైపు ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుండటం పట్ల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ముసుగు తొలగించి తమ పన్నాగాన్ని బహిర్గతం చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ అసలు విషయం చల్లగా వినిపించారు.
తద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణ తథ్యం అని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఆయువు తీసేందుకు పావులు కదపడం మొదలు పెట్టింది. వంద శాతం విద్యుత్ బస్సుల (ఈ–బస్సులు) విధానం ముసుగులో పక్కా పన్నాగం పన్నింది. కానీ ఈ–బస్సులను ఆర్టీసీ నిర్వహించవచ్చన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని తిరస్కరించింది. కార్పొరేట్ సంస్థల ద్వారానే ఈ–బస్సులు ప్రవేశ పెట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉద్యోగుల సంఖ్యలో కోత విధించవచ్చని కూడా ప్రకటించింది. గత ఏడాది నవంబరులో సీఎం చంద్రబాబు సమక్షంలోనే నిర్వహించిన సమీక్షలో ఆ మేరకు ఆర్టీసీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది.
ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగులే
ఆర్టీసీలో ప్రస్తుతం 11,116 బస్సులు ఉన్నాయి. 2029 నాటికి ఆర్టీసీలో వంద శాతం ఈ–బస్సులే ఉండాలనే విధానానికి ప్రభుత్వం 2024 నవంబర్‌లో ఆమోదించింది. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 100 ఈ–బస్సుల్లో పూర్తిగా ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులను ప్రవేశ పెడతామని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. అంటే ఈ–బస్సుల ముసుగులో పూర్తిగా ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలన్నది ప్రభుత్వ పన్నాగమన్నది సుస్పష్టమవుతోంది. ఆర్టీసీ వేలుతోనే ఆ సంస్థ కన్ను పొడిచే పన్నాగాన్ని చంద్రబాబు సర్కారు అమలు చేస్తోంది. ఆర్టీసీని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఆ సంస్థ ఉన్నతాధికారుల ద్వారానే నివేదిక ఇప్పించుకోవడం గమనార్హం.
50 శాతం ఈ–బస్సులను ప్రవేశ పెట్టేందుకే అవసమైన వ్యయాన్ని భరించలేమని ఆర్టీసీ ఉన్నతాధికారులే నివేదిక ఇచ్చేలా కుట్ర పన్నింది. అనంతరం ఆ నివేదికను చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమోదించారు. ఆ నివేదిక ప్రకారం 50 శాతం ఈ–బస్సులకు అవసరమైన రూ.8,243 కోట్ల మూల ధన వ్యయంతోపాటు ప్రతి నెల రూ.336 కోట్ల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదని తేల్చి చెప్పేశారు. కాబట్టి విద్యుత్ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. 50 శాతం బస్సులే నిర్వహించలేమని తేల్చి చెప్పిన ప్రభుత్వం.. మరోవైపు ఆర్టీసీలో 2029 నాటికి వంద శాతం ఈ–బస్సులు ప్రవేశపెడతామని ప్రకటించింది. అంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తామని తేల్చి చెప్పింది. 
రూ.6 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటుకు..
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో 12 డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నెముకకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలో అత్యంత విలువైన ప్రదేశాల్లో ఉన్న డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆయా ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ రూ.50 కోట్లు లెక్కన వేసుకున్నా, ఆ 12 డిపోల మార్కెట్ విలువ ఏకంగా రూ.6 వేల కోట్లు!
పక్కా కుతంత్రంతో ఆర్టీసీ నిర్వీర్యం
⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా కుతంత్రంతో పావులు కదుపుతోంది. అందుకోసం ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ‘ప్రధానమంత్రి ఈ–బస్ సేవా’ పథకం కింద ప్రవేశపెట్టే ఈ–బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆర్టీసీ కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయడం లేదు.
⇒ గత ఆరు నెలల్లోనే కాలం చెల్లిన 264 బస్సులను ఇటీవల సర్వీసుల నుంచి తొలగించారు. కానీ వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనే లేదు. మరో 2 వేల బస్సులు 15 ఏళ్ల కాల పరిమితి దాటిపోయాయి. ఆ డొక్కు బస్సులనే కొనసాగిస్తోంది. సగటున రోజుకు ఒక బస్సును సర్వీసు నుంచి తొలగిస్తోంది. కానీ కొత్తగా కొనుగోలు చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేస్తోంది. తద్వారా ఆర్టీసీలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–బస్సులను ప్రవేశపెట్టాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేస్తోంది.
⇒ ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తోంది. ఏడాదిలో 617 మంది డ్రైవర్లు, 821 మంది కండక్టర్లు రిటైరయ్యారు. అంటే 1,438 పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం ఆర్టీసీలో దాదాపు 8 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే ఆ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశమేలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అందుకే జాబ్ కాలండర్‌లో ఆర్టీసీలో ఉద్యోగాల ఊసే ఎత్త లేదు.
⇒ 2029 నాటికి ఆర్టీసీలో 50 శాతం పోస్టులు ఖాళీ అవుతాయి. దాంతో ఆర్టీసీని మూసివేయవచ్చన్నది బాబు ప్రభుత్వ కుతంత్రంగా ఉందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం బరితెగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీకి స్వర్ణ యుగం
ఆర్టీసీ అభివృద్ధి, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా.. వైఎస్ జగన్ ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక కలను సాకారం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. విలీనం వద్దు అని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినా సరే, వైఎస్ జగన్ మాత్రం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అమలులోకి వచ్చింది. ఫలితంగా ఉద్యోగులకు ప్రతి నెలా జీతాల కోసం ప్రభుత్వం రూ.360 కోట్లు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఆర్టీసీ ఆర్థిక కష్టాలు తీరాయి.
దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ఆర్టీసీ ప్రతి నెలా బ్యాంకుల నుంచి అప్పులు చేస్తూ వచ్చింది. ఆ ఆర్థిక ఇబ్బందులను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. 2020లో ఆర్టీసీకి ఉన్న రూ.8 వేల కోట్ల అప్పుల్లో 2024 నాటికి రూ.5 వేల కోట్లు అప్పు చెల్లించింది. 220 కొత్త బస్సులు కొనుగోలు చేసింది. మరో 1,500 బస్సులను రీ–మోడలింగ్ చేసింది. దాంతో ఆర్టీసీ ప్రగతి బాట పట్టింది. ఉద్యోగుల అలవెన్సులను ప్రతి నెలా జీతాలతో పాటు చెల్లించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విధంగా అటు ఆర్టీసీ అభివృద్ధి, ఇటు ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యదిక ప్రాధాన్యం ఇచ్చిందని, అది ఆర్టీసీకి స్వర్ణ యుగమని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేసుకుంటున్నారు.


