విశాఖలో విజయుడెవరు..?

Visakhapatnam Lok Sabha Constituency is Proof of a Culture Of Rural And Urban Life - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం.. గ్రామీణ, నగర జీవితం మిళితమైన  సంస్కృతికి నిదర్శనం.. ఎన్నో విశిష్టతలున్న ఇక్కడి ఓటర్ల తీర్పే ప్రత్యేకం.. అందువల్లే ప్రతి ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారి చూపు విశాఖపైనే ఉంటుంది. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో విశాఖ తూర్పు, ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, గాజువాక, భీమిలి నియోజక వర్గాలతో పాటు విజయనగరం జిల్లాలోని ఎస్‌కోట అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 17 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది సార్లు, స్వతం త్రులు ఐదు సార్లు, టీడీపీ మూడుసార్లు గెలుపొందగా, టీడీపీ పొత్తుతో బీజేపీ గత ఎన్నికల్లో విజయం సాధించింది. 

మొట్టమొదటి సభ్యుడు అల్లూరి అనుచరుడు 
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడు గంటం మల్లుదొర తొలిసభకు స్వతంత్రుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికై విశాఖ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పీవీజీ రాజు (స్వతంత్ర), టి,సుబ్బిరామిరెడ్డి,  విజయానంద్‌ (కాంగ్రెస్‌), ఎంవీవీఎస్‌ మూర్తి (టీడీపీ)లు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు.  

ఉపాధి అవకాశాలు అంతంతే...
విశాఖ జిల్లాకు 2.60లక్షల కోట్ల విలువైన 429 ఒప్పందాలు జరిగాయి. వాటి ద్వారా 7.14లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు గొప్పలు చెప్పారు. అయితే ఏషియన్‌ పెయింట్స్‌ పరిశ్రమ తప్ప కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడకు వచ్చిన దాఖలాలు లేవు. పట్టుమని వెయ్యిమందికి కూడా ఇక్కడ కొత్తగా ఉపాధి లభించిన దాఖలాలు లేవు.

వైఎస్సార్‌సీపీకి సానుకూల పవనాలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా ఎంవీవీ బిల్డర్‌గా విశాఖ వాసులకు చిరపరిచితులు. విశాఖ బిల్డర్స్‌ అసోసియేషన్‌కు రెండుసార్లు చైర్మన్‌గా వ్యవహరించారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీలో చేరిన ఎంవీవీ విశాఖ లోక్‌సభ కో ఆర్డినేటర్‌గా ప్రజాసమస్యలపై నిరంతరం అనేక ఉద్యమాలు చేశారు. విస్తృతంగా పర్యటిస్తూ అన్ని ప్రాంతాల నాయకులను కలుపుకుని వెళ్తున్నారు.

ఎంవీవీఎస్‌ మూర్తి వారసుడిగా శ్రీభరత్‌
దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి  రాజకీయ వారసుడిగా ఆయన మనుమడు టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీ భరత్‌ బరిలోకి దిగారు. నియోజకవర్గానికి పూర్తిగా కొత్తయిన శ్రీభరత్‌ సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు. 
నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా మామ ద్వారానే పార్టీ అధినేతపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ సీటు సాధించుకున్నారు. విశాఖ వాసులకు కనీస పరిచయం కూడా లేని భరత్‌కు ఇక్కడ సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. ఏనాడూ ఏ సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్న దాఖలాలు కూడా లేవు.

బీజేపీ తరఫున పురందేశ్వరి 
సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ కే.హరిబాబు పోటీకి దూరంగా ఉండడంతో దగ్గుపాటి పురేందేశ్వరి బరిలో నిలిచారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయిన ఈమె ఈ ప్రాంత అభివృద్ధిని ఏనాడు పట్టించు కోలేదని విశాఖ వాసులంటున్నారు. జనసేన తరపున బరిలోకి దిగిన సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ విశాఖకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి. తొలుత ఈ స్థానం నుంచి టికెట్‌ ఖరారైన గేదెల శ్రీనుబాబు జనసేన పార్టీ విధానాలు నచ్చక వైఎస్సార్‌సీపీలో చేరగా, ఆ తర్వాత రాయలసీమకు చెందిన లక్ష్మీనారాయణకు టికెట్‌ ఇచ్చారు. 

అభ్యర్థులు వీరే...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంవీవీ సత్యనారాయణ, టీడీపీ తరఫున ఎం.శ్రీభరత్, జనసేన అభ్యర్థిగా వీవీ లక్ష్మీనారాయణ, బీజేపీ నుంచి దగ్గుపాటి పురందేశ్వరి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పేడాడ రమణకుమారి పోటీలో ఉన్నారు. 

– పంపాన వరప్రసాదరావు, సాక్షి, విశాఖపట్నం

Read latest YSR Photos News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top