
జాతీయ అధ్యక్ష పదవి రేసులో నిర్మలా సీతారామన్,పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్
పార్టీ చరిత్రలో తొలిసారి మహిళా నేతకు అవకాశం
మహిళకు బాధ్యతలు కట్టబెట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పానికి నిదర్శనంగా బీజేపీ చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ చరిత్రలో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు ఒక మహిళకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు ఈసారి దక్షిణాదికి చెందిన మహిళా నేతకే దక్కుతాయని ఢిల్లీలో ఉహాగానాలు ఊపందుకున్నాయి. ఈ రేసులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ మహిళా నేతలు ఉన్నారనే చర్చ జరుగుతోంది.
వారిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. మహిళకు పార్టీ పగ్గాలు కట్టబెట్టేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కూడా ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఏడాదిన్నర కాలంగా జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు కొద్దిరోజుల్లో తెరదించేలా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.
ముందంజలో నిర్మలా సీతారామన్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ లను కలిశారు. కమలం పార్టీ అధ్యక్ష పీఠం కోసం జరుగుతున్న రేసులో ఆమె ముందువరుసలో ఉన్నారనే చర్చ మొదలైంది. సీనియర్ నేతగా, గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించేందుకు వీలవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
రేసులో పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్
నిర్మలా సీతారామన్ తర్వాత.. కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు వినిపిస్తోంది. ఆమెకు పలు భాషల్లో ప్రావీణ్యం ఉంది. రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞురాలు. అలాగే బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. తమిళనాడుకు చెందిన ఆమె వృత్తిరీత్యా న్యాయవాది. ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌పై విజయం సాధించారు. 1993లో బీజేపీలో చేరిన నాటినుంచి ఎన్నో కీలక పదువులు చేపట్టారు.
2020లో మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా, 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి చేరుకున్న మొదటి తమిళనాటు మహిళా నేత వనతి. కాగా.. ఢిల్లీలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్‌ల సమావేశాలు నిర్వహిస్తోంది. ఆర్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ లు పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో బీజేపీ కొత్త అధ్యక్ష ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.