మూడోది.. మరింత పవర్‌తో!

Nuclear submarine that is preparing - Sakshi

సిద్ధమవుతోన్న అణుజలాంతర్గామి 

తొలి రెండు సబ్‌మెరైన్‌లకంటే శక్తిమంతం

సాక్షి, విశాఖపట్నం: నావికాదళంలో మూడో అణు జలాంతర్గామి సిద్ధమవుతోంది. అడ్వాన్స్‌ టెక్నాలజీ వెసల్‌(ఏటీవీ) ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞా నంతో తయారయ్యే ఐదు అణు జలాంతర్గాముల్లో ఇది మూడోది. విశాఖలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో  దీని నిర్మాణం జరుగుతోంది. దీనికి త్వరలో పేరు ఖరారు చేయనున్నారు. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ను 2009 లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సతీమణి గురు శరణ్‌ కౌర్,అరిధామన్‌ను నవంబర్‌లో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించారు. తర్వాత అరిదామన్‌ పేరును అరిఘాత్‌గా మార్చారు. ఈ సబ్‌ మెరైన్‌ను ఈ ఏడాది ఆఖరికల్లా ప్రారంభించను న్నారు. మూడు అణుజలాంతర్గాములు విశాఖ జిల్లా రాంబిల్లి వద్ద ఉన్న నేవల్‌ ఆల్టర్నేటివ్‌ బేస్‌ ‘ఐఎన్‌ఎస్‌ వర్ష’ స్థావరంగా విధులు నిర్వహించనున్నాయి. 

అధిక శక్తిశాలి...
ఐఎన్‌ఎస్‌ అరిహంత్, అరిఘాత్‌లు 112 మీటర్ల పొడవుంటాయి. ఈ మూడో అణు జలాంతర్గామి ఒకింత పొడవు, వాటికంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిహంత్‌లో కె–4 రకం సబ్‌మెరైన్‌ లాంచ్‌డ్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌(ఎస్‌ఎల్‌బీఎం) నాలుగు ఉండగా మూడో సబ్‌మెరైన్‌లో ఎనిమిది ఉంటాయి. ఇవి 3,500 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలు గుతాయి. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, టార్పెడోలు, టార్పెడో ట్యూబ్‌లు ఉంటాయి. 6,000 టన్నులకు పైగా బరువును మోసుకెళ్లగలుగుతుంది.

నీటిపైన గంటకు 15 నాటికల్‌ మైళ్లు, నీటి అడుగున 24 నాటికల్‌ మైళ్లకు పైగా వేగంతో పయనిస్తుంది. నీటి కింద 300 మీటర్ల దిగువ వరకు వెళ్లగలుగుతుంది. అరిహంత్‌కంటే మరింత శక్తిమంతమైన ప్రెజరైజ్డ్‌ వాటర్‌ రియాక్టర్‌ను రూపొందించనున్నారు. ఇందులోని అణు రియాక్టర్లు బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో డిజైన్‌ చేశారు. మొత్తం ఈ ఏటీవీ ప్రాజెక్టుకు 2.9 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు.  ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇంగ్లండ్‌ దేశాలే అణుజలాంతర్గాములు కలిగి ఉన్నా యి. అరిహంత్‌ నూక్లియర్‌ సబ్‌మెరైన్‌ ప్రారంభంతో వీటి సరసన ఆరో దేశంగా భారత్‌ చేరింది. 

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top