చిట్టచివరి శాసన పరిష్కర్త

చిట్టచివరి శాసన పరిష్కర్త


 అభిప్రాయం

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారితో పరిచయం ఓ అదృష్టం. తెలుగు ప్రజల చరిత్ర రచనకి ఆయన చూపిన ఒరవడి గొప్పది. 2003 గోదా వరి పుష్కరాల సందర్భంలో ‘గోదావరి’ పుస్తకం రాస్తున్న ప్పుడు ఆయనని కలవడం తటస్థించింది. ఒక అపరాహ్ణ వేళ నల్లకుంట (హైదరాబాద్)లోని వారి ఇంటికి వెళ్లాం. ‘‘మేం జర్నలిస్టులమండి, ఇంటర్వ్యూ కోసం వచ్చాం’’అన్నాం. ఆయన చిత్రంగా చూశారు.



‘‘జర్నలిస్టులకి నాతో ఏం పని? నేను చెప్పేదేం లేదే...’’అన్నారు. మేం అవాక్కయ్యాం.

 కాసేపు మాట్లాడి ‘‘మీరు చరిత్ర మీద రాసిన పుస్తకాలు కావాలండి’’అన్నాం. ‘‘మీరు జర్నలిస్టుల మంటున్నారు. చరిత్రతో మీకేం పని? అవసరం లేని వారికి పుస్తకాలు ఇవ్వను’’అన్నారు.



చరిత్ర గురించి మాకున్న మిడిమిడి జ్ఞానాన్ని ప్రద ర్శించాకా ... పోన్లే అని అనుకుని ఉంటారు.. రెండు పుస్త కాలు ఇచ్చారు- ‘శాతవాహన ఎపోక్’, ‘రూరల్ స్టడీస్ ఇన్ ఎర్లీ ఆంధ్ర’. చరిత్ర గురించి చెప్పిన విషయాలు, దృక్పథం మమ్మల్ని ఆయన ప్రేమలో పడేశాయి. శాతవాహనులు, కాకతీయుల మీద ఆయన పరి శోధన అపూర్వమైనది. తెలుగు ప్రజలు ఆయనకి రుణపడి ఉండాలి. శాతవాహనులు ఆంధ్రులా కాదా అన్న చర్చ జరిగిన ఆ రోజులలో తనకు దొరికిన ఆధారాలని స్వయంగా పరిశీలించి శాతవాహనులు, వారి పూర్వీకు లైన గోదావరి తీరప్రాంత గణనాయకులు గోబద, సమ గోప, సిరికం వాయ వంటి వారిని విశ్లేషించి, వారుఆంధ్రులేనని తిరు గులేకుండా రుజువు చేశారు. ఆ వంశీ కుల కాలక్రమణి కను ‘శాతవాహన ఎపోక్’లో చూపారా యన. అందుకే నేమో ‘‘ఒక్క సిముఖుడు చాలు నన్ను చిరంజీవిని చేయ డానికి!’’ అన్నారాయన. శాతవాహన శకాన్ని శోధించి అప్పటి వరకూ ఉన్న చరిత్రని తిరగరాశాడాయన.



చరిత్రని చరిత్రగా చూడడం ఆయన దృక్పథం. ‘తెలుగువారి చరిత్ర అంటే తీరాంధ్రలో ఏముందయ్యా.. తెలంగాణ  ప్రాంతంలో ఉందిగానీ...’అనేవారు. గోదావ రిని తెలివాహ అని పిలిచే వారని తొట్టతొలిసారి నిరూ పించాడాయన. కరీంనగర్‌జిల్లా కోటిలింగాల వెళ్లి తన మిత్రుడు సంగనభొట్ల నరహరి ఇచ్చిన నాణేలని పరిశో ధించి ‘భారతి’లో ఆయన ప్రచురించిన వ్యాసాలు తెలుగు చరిత్రని మలుపు తిప్పాయి. చరిత్ర ముఖ్యంగా మనలాంటి దేశ చరిత్ర తెలియాలంటే శాసనాలనీ, నాణే లనీ పరిష్కరించాలి. అందుకోసం సంస్కృత భాష, వ్యాకరణం, ప్రాకృత వ్యాకరణం మీద మంచి పట్టు ఉండాలనేవారాయన. శాసనాల మీది పిచ్చిగీతల్లాంటి అక్షరాల్ని ఆయన అలవోకగా చదివేయడం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఎపిగ్రఫిస్ట్. బహుశా మనదేశంలో అయనే చిట్టచివరి ఎపిగ్రఫిస్ట్‌యేమో!  



మత్స్య, వాయుపురాణాలు  శాతవాహనుల పాలన గురించి ప్రస్తావించాయి. 1978 జూన్ ‘భారతి’లో ‘సిముక శాతవాహనుడి నాణాలు’ అని ఆయన రాసిన వ్యాసం శాతవాహనుల కాలం గురించిన అనేక సమస్యల్ని పరిష్కరించింది. మౌర్యుల తరువాత ఒక దక్షిణాపథ రాజ్యపరిపాలన ఉపఖండం నలుమూ లలకీ విస్తరించడం శాతవాహనులతోనే సాధ్యమైంది. చరిత్ర, వాటి ఆధారాల గురించిన మన దృక్పథంలో  పరబ్రహ్మశాస్త్రిగారు సమూల మార్పు తెచ్చారు. ఇంతటి అపూర్వ పరిశోధకుడు అత్యంత నిరాడంబరంగా జీవించారు. ఆయనకి ప్రణమిల్లుతూ...



(వ్యాసకర్త : అద్దేపల్లి ప్రభు  కథారచయిత, మొబైల్‌ః 9848930203)

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top