స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక.. సోషల్ మీడియా మత్తులో జనం మునిగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా.. గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. యూట్యూబ్-ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అని, మీమ్స్ అని.. ఇలా రాత్రి, పగలు తేడా లేకుండా సోషల్ మీడియా సైట్లలోనే గడిపేస్తున్నారు. ఈ విషయంలో పిల్లలనూ తల్లిదండ్రులు కట్టడి చేయలేకపోతున్నారు. అందుకే విప్లవాత్మక మార్పులో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ వాడకంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో..
యూరోపియన్ యూనియన్‌తో మలేషియాలోనూ బ్యాన్‌పై చర్చ జరుగుతోంది. అయితే పూర్తి స్థాయి నిషేధం కాకపోయినా.. ఫ్రాన్స్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో నియంత్రణకు చట్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ స్పూర్తితో భారత్‌లోనూ అలాంటి నిర్ణయం జరగాలన్న అభిప్రాయాల్ని ఓ సర్వే తోసిపుచ్చింది. భారత్‌లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారట!!..
పిల్లల విషయంలో సోషల్ మీడియా వాడకంపై అభిప్రాయం కోరుతూ Ipsos, Statista సంయుక్తంగా ‘గ్లోబల్’ సర్వే నిర్వహించాయి. ఇందులో 30 దేశాలకు చెందిన వేల మంది తల్లిదండ్రులు ఫీడ్ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న 70 శాతం మంది నియంత్రణ సబబేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా ఇండోనేషియా ఆ తర్వాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నుంచి ఈ ఒపీనియన్ వెల్లడైంది. అయితే..
భారత్ నుంచి మాత్రం మిశ్రమ స్పందన లభింaచింది. వందలో 68 మంది మాత్రమే చిన్నారులకు సోషల్ మీడియా కట్టడిని సమర్థించారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. కిందటి ఏడాది ఇది 73 శాతం ఉంది. అంటే.. ఇప్పుడు 5 శాతానికి తగ్గిపోయిందన్నమాట.
ఆన్‌లైన్ భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ.. పూర్తి నిషేధం సబబు కాదనే అభిప్రాయం తాజా సర్వేలో ఇండియన్ పేరెంట్స్ నుంచి వ్యక్తమైంది. బ్యాన్‌కి బదులు మార్గదర్శకత్వం అవసరం అనే అభిప్రాయం కూడా పెరుగుతోంది.
సోషల్ మీడియా వల్ల పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే మా నుంచి కూడా పరిమితులు ఉండాల్సిన అవసరం ఉంది.:హైదరాబాద్‌కు చెందిన ఓ తల్లి
నిషేధం సబబు కాదు. దాని కంటే సరైన గైడ్‌లైన్స్ మీద దృష్టి పెట్టాలి: బెంగళూరుకు చెందిన ఓ తండ్రి
భద్రతా సమస్యలు ఉన్నా సో.మీ.ను పూర్తిగా నిషేధించడం సమర్థనీయం కాదు: ఢిల్లీకి చెందిన తల్లిదండ్రులు

సోషల్ మీడియా వినియోగం అనేది పిల్లల వికాసం, అవగాహన కోసం ఉపయోగపడుతుందని కొంతమంది తల్లిదండ్రుల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
భారత్‌కు డిజిటల్ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయింది. విద్యా, వ్యాపార అభివృద్ధి, కమ్యూనిటీ నిర్మాణం లాంటి రంగాల్లో ఎక్కువగా సోషల్ మీడియా వినియోగం ఉంటోంది. మరీ ముఖ్యంగా.. యూత్ కల్చర్‌లో లోతుగా కలిసిపోయింది. అందుకే ఎక్కువ మంది తల్లిదండ్రులు కఠిన నియంత్రణలు అవసరమని భావిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీనికితోడు ఇక్కడి ప్రభుత్వాలు కూడా.. నిషేధం కంటే నియంత్రణ మీదే(వయస్సు ధృవీకరణ, డిజిటల్ విద్యా అవగాహన, తల్లిదండ్రుల పర్యవేక్షణ లాంటి అంశాలు) ఎక్కువ దృష్టిసారిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా పిల్లల విషయంలో హానికరమైన కంటెంట్, అల్గోరిథం విషయంలో నియంత్రణలకు సిద్ధంగానే ఉన్నట్లు సూచన ప్రాయంగా చెబుతున్నాయి.
జర్మనీలో.. భారత్‌కు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా నిషేధానికి మద్దతు ఇచ్చిన వారి శాతం అత్యల్పంగా 53% ఉన్నప్పటికీ, గత సంవత్సరం కంటే మద్దతు 13% పెరిగింది. ఇది పెరుగుతున్న అక్కడి తల్లిదండ్రుల ఆందోళనను, మారుతున్న పిల్లల ఆలోచనా ధోరణిని సూచిస్తోంది.


