breaking news
addepalli prabhu
-
సమాన అవకాశాలకు దారి ఇంగ్లిష్ మీడియం
సైంటిఫిక్గా నిరూపణ అయిన కొన్ని సత్యాలు సామాజికమైన విషయాలలో కొన్ని చారిత్రక సందర్భాల్లో విఫలమౌతూ ఉంటాయి. మాతృభాషలో విద్యాబోధన అనేది అటువంటిదే. మాతృభాషలో విద్య సమాజా న్ని నిర్మిస్తుందనేదాన్నీ, దాని వల్ల ఉండే ప్రయోజనాలనీ కాదనలేం. అది తార్కికంగా నిరూపణ అయింది. కానీ అది సమాజంలో వ్యతిరేక ఫలితాలని తీసుకువచ్చింది. విద్యా బోధనలో ఏ భాష ఉపయోగించాలనే దాని మీద ఒకప్పుడు చర్చ జరిగి అంతిమంగా గ్రాంథిక భాషావాదులది పైచేయి అయింది. గ్రాంథిక భాషావాదులతో ఢీకొని వ్యవహారిక భాషే ఉండాలని గిడుగు రామ్మూర్తివంటి వారు అసమానమైన పోరాటం చేశారు. దానిఫలితంగానే మాతృభాషలో విద్య వ్యవహారిక భాషలోకి వచ్చి చదువు సమాజంలోని అందరికీ అందుబాటులోకి వచ్చింది. కులానికొక ప్రత్యేకమైన తెలుగు భాష ఉన్న మన సమాజంలో అటువంటి ఒక ప్రామాణికత అవసరమనీ, అదికాస్తా ఆధిపత్య కులాల భాష అయిఉండాలని వాళ్ళు సహజంగా అనుకున్నారు. తెలుగు భాష సంగతి పక్కనపెడితే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో నూ ఇంగ్లిషు భాషనించి అనువదించి తెలుగు అనే పేరుతో చిత్ర విచిత్రమైన సంస్కృత భాషని దిగుమతి చేశారు. వీరికి సంస్కృతం పరాయిది కాదు. అది పవిత్రమైనది కూడా. అందుకే ఆ మాటలు పలకలేని వారిని ఎగతాళి చేసి అణిచేశారు. ప్రయివేటు కాన్వెంట్లు ఈ మొత్తం వ్యవస్థకి వ్యతిరేకంగా మరొక విద్యావ్యవస్థని అభివృద్ధిచేసుకుంటూ వస్తున్నాయి. దాని ప్రాథమిక సూత్రం ఇంగ్లిషు మీడియం. ఇంగ్లిషు పరాయిదే అయినా అది పవిత్రమైనది కాదు. అది ఎవరైనా నేర్చుకోగలిగిన అంతర్జాతీయ భాష. ప్రయివేటు విద్యా వ్యవస్థ రెండో సూత్రం ఫలితాల ప్రాతిపదిక. అది ఫలితాల కోసం ఫలితాలను మాత్రమే ఇచ్చేందుకు విద్యార్థుల్ని నియంత్రిస్తుంది. అది సైంటిఫిక్ కాదు. అది విధ్వంసకరమైంది. అయినా విజయం సాధించింది. విద్యా బోధన గురిం చి ఉన్న అన్నిరకాల నైతిక, పవిత్ర ముసుగుల్ని ప్రయి వేటు విద్యావ్యవస్థ చించి పడేసింది. డబ్బు పెట్టగలిగే తల్లిదండ్రులున్న పిల్లలు కాన్వెంటులో ఇంగ్లిషు మీడియంలో చదివి మంచి ఫలితాల్ని సాధిస్తూ ఎదిగిపోతుంటే డబ్బు పెట్టలేని తల్లిదండ్రులున్న గ్రామీణ వెనుకబడిన వారి పిల్లలు ప్రభుత్వం అందించే ఉచిత తెలుగు మీడియం స్కూళ్ళలో చదువుతూ ప్రాథమిక విద్య ముగిసినా చదవడం రాయడం రాక డ్రాపౌట్లుగా మిగిలిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాపరమైన చైతన్యం ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆటోలోనూ, బస్సులోనూ కాన్వెంట్లకి పంపుతున్నారు దళిత, ఇతర కులాల పిల్లలు ప్రాథమిక స్థాయిలో కాన్వెంట్లకి వెళ్ళినా హైస్కూలు స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. చదవ గలిగిన పిల్లలందరూ ఇంగ్లిషు మీడియంలోనే ఉంటున్నారనేది వాస్తవం. గ్రామీణ పాఠశాలల్లో టీచర్లకి కూడా ఈ మీడియం వివక్ష అప్రయత్నంగా ఉంటుంది. ఇంగ్లిషు మీడియం పిల్లల్ని తెలుగు మీడియం పిల్లల్ని సమానంగా చూడరు వాళ్ళు. కుల పరంగా చూస్తే తెలుగు మీడియంలో ఎక్కువ సంఖ్య దళితుల పిల్లలదే. కుల పరమైన వివక్ష మీడియం వివక్షగా వ్యక్తీకరణ అవుతూ ఉంటుంది. తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలలో ఏదైనా ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులకు ఇవ్వాలని కొంత మంది అంటారు గానీ క్షేత్ర స్థాయిలో మీడియం విషయంలో టీచర్లదే చివరి మాట. ఏదో ఒక పరీక్షలాంటిది పెట్టి చదవలేని పిల్లలు అంటూ వారిని బలవంతంగా తెలుగు మీడియంలో పడేస్తారు. తల్లిదండ్రులు టీచర్ల మాట కాదనలేరు. యిలా రెండుగా విభజితమైన రాష్ట్ర విద్యార్ధుల్ని ఒకటిగా చేసి సమాన అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రమంతటా ఇంగ్లిషు మీడియం రద్దు చేసి తెలుగు మీడియం మాత్రమే ఉంచడం. ఇందుకు డబ్బు పెట్టగల ‘మాతృభాషాభిమానులైన’ తల్లిదండ్రులే ఒప్పుకోరు. ఇక ఉన్న రెండో మార్గం ఇంగ్లిషు మీడియం విద్యని ప్రవేశపెట్టడం. దాని వల్ల కుల మత పేద ధనిక వివక్ష లేకుండా అందరికీ ఒకే రకమైన అవకాశాలని కల్పించే విద్య అందించగలం. తెలుగును సెంటిమెంటుగా తీసుకుని తెలుగు ఏమైపోతుంది అని ఆవేశపడాల్సిన అవసరం లేదు. తెలుగు ఒక సబ్జెక్టుగా ప్రతి విద్యార్థి హైస్కూలు స్థాయి వరకూ చదువుతాడు ఇప్పటిలాగే. తరువాత మార్కులకోసం ఎలాగూ సంస్కృతంలోకి పోతాడు ఇప్పటిలాగే. తెలుగుభాషని ఇంట్లోనూ సమాజం లోనూ నిరవధికంగా హాయిగా నేర్చుకుంటాడు. తన కు పూర్తిగా పరాయిదైన పాఠశాల విద్యలోని సబ్జెక్టుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అర్థమయ్యే విధం గా నేర్చుకుంటాడు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటాడు. విద్యార్థికి నిజమైన మాతృభాష టీచరే. అద్దేపల్లి ప్రభు వ్యాసకర్త ప్రముఖ రచయిత -
చిట్టచివరి శాసన పరిష్కర్త
అభిప్రాయం పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారితో పరిచయం ఓ అదృష్టం. తెలుగు ప్రజల చరిత్ర రచనకి ఆయన చూపిన ఒరవడి గొప్పది. 2003 గోదా వరి పుష్కరాల సందర్భంలో ‘గోదావరి’ పుస్తకం రాస్తున్న ప్పుడు ఆయనని కలవడం తటస్థించింది. ఒక అపరాహ్ణ వేళ నల్లకుంట (హైదరాబాద్)లోని వారి ఇంటికి వెళ్లాం. ‘‘మేం జర్నలిస్టులమండి, ఇంటర్వ్యూ కోసం వచ్చాం’’అన్నాం. ఆయన చిత్రంగా చూశారు. ‘‘జర్నలిస్టులకి నాతో ఏం పని? నేను చెప్పేదేం లేదే...’’అన్నారు. మేం అవాక్కయ్యాం. కాసేపు మాట్లాడి ‘‘మీరు చరిత్ర మీద రాసిన పుస్తకాలు కావాలండి’’అన్నాం. ‘‘మీరు జర్నలిస్టుల మంటున్నారు. చరిత్రతో మీకేం పని? అవసరం లేని వారికి పుస్తకాలు ఇవ్వను’’అన్నారు. చరిత్ర గురించి మాకున్న మిడిమిడి జ్ఞానాన్ని ప్రద ర్శించాకా ... పోన్లే అని అనుకుని ఉంటారు.. రెండు పుస్త కాలు ఇచ్చారు- ‘శాతవాహన ఎపోక్’, ‘రూరల్ స్టడీస్ ఇన్ ఎర్లీ ఆంధ్ర’. చరిత్ర గురించి చెప్పిన విషయాలు, దృక్పథం మమ్మల్ని ఆయన ప్రేమలో పడేశాయి. శాతవాహనులు, కాకతీయుల మీద ఆయన పరి శోధన అపూర్వమైనది. తెలుగు ప్రజలు ఆయనకి రుణపడి ఉండాలి. శాతవాహనులు ఆంధ్రులా కాదా అన్న చర్చ జరిగిన ఆ రోజులలో తనకు దొరికిన ఆధారాలని స్వయంగా పరిశీలించి శాతవాహనులు, వారి పూర్వీకు లైన గోదావరి తీరప్రాంత గణనాయకులు గోబద, సమ గోప, సిరికం వాయ వంటి వారిని విశ్లేషించి, వారుఆంధ్రులేనని తిరు గులేకుండా రుజువు చేశారు. ఆ వంశీ కుల కాలక్రమణి కను ‘శాతవాహన ఎపోక్’లో చూపారా యన. అందుకే నేమో ‘‘ఒక్క సిముఖుడు చాలు నన్ను చిరంజీవిని చేయ డానికి!’’ అన్నారాయన. శాతవాహన శకాన్ని శోధించి అప్పటి వరకూ ఉన్న చరిత్రని తిరగరాశాడాయన. చరిత్రని చరిత్రగా చూడడం ఆయన దృక్పథం. ‘తెలుగువారి చరిత్ర అంటే తీరాంధ్రలో ఏముందయ్యా.. తెలంగాణ ప్రాంతంలో ఉందిగానీ...’అనేవారు. గోదావ రిని తెలివాహ అని పిలిచే వారని తొట్టతొలిసారి నిరూ పించాడాయన. కరీంనగర్జిల్లా కోటిలింగాల వెళ్లి తన మిత్రుడు సంగనభొట్ల నరహరి ఇచ్చిన నాణేలని పరిశో ధించి ‘భారతి’లో ఆయన ప్రచురించిన వ్యాసాలు తెలుగు చరిత్రని మలుపు తిప్పాయి. చరిత్ర ముఖ్యంగా మనలాంటి దేశ చరిత్ర తెలియాలంటే శాసనాలనీ, నాణే లనీ పరిష్కరించాలి. అందుకోసం సంస్కృత భాష, వ్యాకరణం, ప్రాకృత వ్యాకరణం మీద మంచి పట్టు ఉండాలనేవారాయన. శాసనాల మీది పిచ్చిగీతల్లాంటి అక్షరాల్ని ఆయన అలవోకగా చదివేయడం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఎపిగ్రఫిస్ట్. బహుశా మనదేశంలో అయనే చిట్టచివరి ఎపిగ్రఫిస్ట్యేమో! మత్స్య, వాయుపురాణాలు శాతవాహనుల పాలన గురించి ప్రస్తావించాయి. 1978 జూన్ ‘భారతి’లో ‘సిముక శాతవాహనుడి నాణాలు’ అని ఆయన రాసిన వ్యాసం శాతవాహనుల కాలం గురించిన అనేక సమస్యల్ని పరిష్కరించింది. మౌర్యుల తరువాత ఒక దక్షిణాపథ రాజ్యపరిపాలన ఉపఖండం నలుమూ లలకీ విస్తరించడం శాతవాహనులతోనే సాధ్యమైంది. చరిత్ర, వాటి ఆధారాల గురించిన మన దృక్పథంలో పరబ్రహ్మశాస్త్రిగారు సమూల మార్పు తెచ్చారు. ఇంతటి అపూర్వ పరిశోధకుడు అత్యంత నిరాడంబరంగా జీవించారు. ఆయనకి ప్రణమిల్లుతూ... (వ్యాసకర్త : అద్దేపల్లి ప్రభు కథారచయిత, మొబైల్ః 9848930203)