యూఏఈలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు | Sakshi
Sakshi News home page

యూఏఈలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు

Published Sat, Jun 3 2017 11:08 AM

యూఏఈలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా యూఏఈలో నివసిస్తున్న తెలంగాణ వాసులు అబుదాబిలోని తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. రంజాన్‌ మాసం కారణంగా యూఏఈలో వినోద కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. దీంతో కళాకారులెవరూ లేకుండా స్ధానికంగా ఉండే తెలంగాణ వాసులే అవతరణ వేడుకలను జరుపుకున్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సంఘ సభ్యుడి ప్రైవేటు భవనంలో ఈ వేడుకలను జరుపుకున్నట్లు చెప్పారు.

దీప ప్రజ్వలన తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణపతి వందన సమర్పణతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాస్టర్ కవీష్ పాడిన 'జై బోలో తెలంగాణా', 'తెలంగాణా నినాదమే మా నర నరాన' అనే గీతంతో ఒక్కసారిగా కార్యక్రమ వాతావరణం వేడెక్కింది. తదనంతరం ముప్పై ఒక్క జిల్లాల ప్రాశస్త్యం చెప్పే గీతం, మరెన్నో తెలంగాణ గీతాలను చిన్నారులు పాడారు. పల్లె పాటల పై చిన్నారులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి.

సంఘ సభ్యులందరూ కలిసి జై తెలంగాణా అని రాసి ఉన్న కేక్ కట్ చేసి తెలంగాణా గీతం పాడి కార్యక్రమానికి ముగింపు పలికారు. చివరగా సంఘ ప్రతినిధులు రాజా శ్రీనివాస్, పృథ్వి రాజ్, సదానంద్, వంశీ, గంగా రెడ్డి, పావని, అర్చన, రోజా, భాస్కర్ తదితరులు మాట్లాడుతూ బంగారు తెలంగాణా నిర్మాణంలో గల్ఫ్‌లో నివసిస్తున్న తెలంగాణీయుల పాత్ర ఎంతగానో ఉందని సభకు తెలియజేస్తూ, ఆ దిశలో సంఘ తరుఫున చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ఆట పాటలతో ప్రేక్షకులందరిని అలరించిన చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు.


Advertisement
 
Advertisement
 
Advertisement