బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం | ys jagan raithu bharosa ystra in anantapur district | Sakshi
Sakshi News home page

బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం

Jul 25 2015 1:52 AM | Updated on Jul 25 2018 4:09 PM

బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం - Sakshi

బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం

బాబు రావాలి.. రుణమాఫీ జరగాలి.

రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి: ‘‘బాబు రావాలి.. రుణమాఫీ జరగాలి.. అంటూ మా ఊళ్లో ఎన్నికల ముందు ఇంటి గోడలపై, స్కూలు బిల్డింగ్‌కు, బ్యాంకు వద్ద పెద్దపెద్ద అక్షరాలతో రాశారు. చంద్రబాబు ఏదో చేస్తారని, ఆయన ఇచ్చిన హామీలు అమలవుతాయని నమ్మి ఓట్లేస్తే.. రుణమాఫీ కాకపోగా 14% అపరాధ వడ్డీని బ్యాంకు అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం’’ అని రొద్దం మండలం వై.టి.రెడ్డిపల్లి గ్రామస్తులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. మూడో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా శుక్రవారం పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని వై.టి.రెడ్డిపల్లిలో మహిళా రైతు లక్ష్మీదేవమ్మ, పెద్దపాతన్న, గోనిమేకలపల్లిలో శ్రీనివాసులు, గోపీనాథ్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.

బ్యాంకులో ఉన్న బంగారాన్ని కూతురు పెళ్లికి విడిపించలేక తన భార్య ఆత్మహత్య చేసుకుందని లక్ష్మీదేవమ్మ భర్త హనుమంతప్ప వాపోయారు. ప్రభుత్వం రూ. 1.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ‘‘వాళ్లు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు. వాళ్లు ఇవ్వాలనుకుంటే ఒక రకమైన సహాయం.. ఇవ్వకూడదనుకుంటే మరోరకం సహాయం.. లేదంటే అది కూడా ఇవ్వకుండా ఉంటారు. ఇలాగైతే చనిపోయిన రైతు కుటుంబాలకు మేలు జరిగేదేలా?’’ అని సర్కారు తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి సమీపంలోనే ఉన్న రైతు పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శించారు. పాతన్న కూతురు అంజలి(12) పుట్టుకతోనే మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతోందని తెలుసుకుని... ఆమెకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించే బాధ్యతను తీసుకున్నారు. తన భర్త మరణానికి ఎక్స్‌గ్రేషియా వర్తించదని అధికారులు నివేదికలు రూపొందించారని శ్రీనివాసులు భార్య సరోజమ్మ వాపోయారు. ఆమె కు న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement