‘మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు’ | You do not seem to regret | Sakshi
Sakshi News home page

‘మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు’

Aug 8 2015 2:37 AM | Updated on Sep 3 2017 6:59 AM

‘మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు’

‘మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు’

‘ఒక అమ్మాయికి అన్యాయం జరిగినా.. ఇప్పటికీ మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు...’ అంటూ రిషితేశ్వరి కేసు....

మాజీ ప్రిన్సిపల్ బాబురావునుద్దేశించి జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి
రిషితేశ్వరి కేసు మూసివేసిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ


గుంటూరు లీగల్: ‘ఒక అమ్మాయికి అన్యాయం జరిగినా.. ఇప్పటికీ మీలో పశ్చాత్తాపం కనిపించడం లేదు...’ అంటూ రిషితేశ్వరి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ బాబురావును ఉద్దేశించి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. లక్ష్మీనరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. ఆచార్య నాగార్జున యూనివర్సీటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు, వార్డెన్ స్వరూపారాణిలు శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఎదుట హాజరయ్యారు. రిషితేశ్వరికేసులో ‘సాక్షి’ కథనాలను ఆధారంగా సుమోటోగా తీసుకుని వారిద్దరికీ ప్రిలిటికేషన్ కేసు కింద నోటీసులు పంపిన విషయం విదితమే. నోటీసులు అందుకున్న ఇద్దరూ ఈ నెల 1వ తేదీన సంస్థ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. మరింత సమగ్ర సమచారంతో రావాలని న్యాయమూర్తి వారిని ఆదేశిస్తూ విచారణను 7వ తేదీకి వాయిదా వేశారు. దీంతో తిరిగి ఇరువురూ హాజరుకాగా ఇప్పటికే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ప్రభుత్వం నియమించిన సుబ్రమణ్యం కమిటీ సైతం విచారణ జరుపుతున్న తరుణంలో ప్రిలిటికేషన్ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదంటూ ఈ కేసును మూసివే స్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

అయితే మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరై విద్యార్థిని మృతి పట్ల ప్రిన్సిపల్ బాబురావులో ఎటువంటి పశ్చాతాపం కనపడటం లేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ప్రిన్సిపల్ పదవిలో ఎవరూ ఉన్నా విద్యార్థిని మృతి పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చే స్తారని, కానీ మీలో అది కనపడటంలేని బాబురావుని ప్రశ్నించారు. సమాధానంగా బాబురావు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై తాను తీవ్రంగా పశ్చాత్తాపం చెందుతున్నానని తెలిపారు. పక్కనే ఉన్న ప్రిన్సిపుల్ కుమారుడిని ‘ఏం చేస్తున్నావు?’ ప్రశ్నించగా తాను ‘ఇంటీరియర్ డెకరేషన్’ చేస్తున్నట్లు ఆ యువకుడు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి ‘ముందు మీ తండ్రిని డెకరేట్ చేయాల్సిన అవసరం ఉంది...’ అని వ్యాఖ్యానించారు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement