ప్రత్యేక హోదా సంజీవని కాదు

ప్రత్యేక హోదా సంజీవని కాదు - Sakshi


కొందరు గందరగోళం చేస్తున్నారు

* హోదా వల్ల వచ్చేది కొంతే: సీఎం చంద్రబాబు

 
*  కేంద్ర ప్రాయోజిత పథకాలు తగ్గిపోయాయి..

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, కేంద్రం అంతకంటే ఎక్కువ ఆర్థిక సాయం చేస్తున్నందున తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మంగళవారం ప్రధానితో భేటీ అనంతరం  విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటివరకు ఇచ్చిన వాటికి ధన్యవాదాలు తెలిపాం.ప్రత్యేకహోదా అవసరాన్ని గుర్తుచేశాను. రెవెన్యూ లోటు అంచనా రాష్ట్ర విభజన జరిగిన నాడు రూ.15,355 కోట్లుగా చూపారు. అయితే, రూ.2,300 కోట్లు ఇచ్చారు. ఇంకో రూ.12,000 కోట్లు రావాలి. 1.2 కోట్లు జనాభా ఉండే బుందేల్‌ఖండ్‌కు రూ.7,266 కోట్లు ఇచ్చారు. ఏపీ వెనుకబడిన జిల్లాల్లో 2.38 కోట్లు జనాభా ఉంటే మనకు చాలా తక్కువగా వచ్చింది. మనకూ ఆ రీతిలో రావాల్సిన అవసరం ఉంది. కొత్త రాజధాని కోసం రూ.1,500 కోట్లు ఇచ్చారు. మంచి రాజధాని నిర్మించాలంటే సహకరించాలని ప్రధానిని కోరాం..’ అని వివరించారు.

 

ప్రత్యేక హోదా, మినహాయింపులు వేర్వేరు..: ‘ప్రత్యేకహోదా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేర్వేరు. ఈ రెండిటినీ పోల్చడం స రికాదు. ఆరోజు చట్టంలో అవసరమైన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, అదనపు రాయితీలు ఇవ్వాలని చూపారు. విభజన చట్టంలోని 46(3) సెక్షన్ కింద రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాల కు ప్రత్యేక రాయితీలు ఇచ్చారు. ఇప్పటికి ఇచ్చింది 15% క్యాపిటల్ అలవెన్స్, 15% డిప్రిసియేషన్ అలవెన్స్. హిమాచల్‌ప్రదేశ్, కశ్మీర్ రాష్ట్రాలకు మాదిరిగా ప్యాకేజీ ఇవ్వాలని కోరాం..’ అని చెప్పారు.

 

ప్రత్యేకహోదాపై..: ‘ప్రత్యేకహోదాలో ఎక్స్‌టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు(ఈఏపీ)లో 90% కేంద్రగ్రాంటు, 10% రాష్ట్ర వాటా ఉంటుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90% కేంద్ర వాటా, 10% రాష్ట్ర వాటా ఉంటుంది. ఈ రెండూ వస్తాయి. దీనికి పారిశ్రామిక ప్రోత్సాహకాలకు సంబంధం లేదు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పిన తర్వాత దానిని ఎలా అధిగమించాలన్న అంశంపై పరిశీలిస్తామన్నారు. షెడ్యూలు 13కింద రావలిసిన సంస్థలను, విద్యాసంస్థలు, మౌలిక వసతులు రావలిసి ఉంది..’ అని పేర్కొన్నారు. విలేకరుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..

 

ప్రత్యేకహోదాపై పరిశీలిస్తామన్నారా? ప్రత్యామ్నాయమా?

చట్టంలో కొన్ని నిబంధనలు పొందుపరిచారు. కొన్ని పార్లమెంట్ లో చెప్పారు. దీనితోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని కాదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో సమానంగా అభివృద్ధి అయ్యే బలం ఇవ్వాలని కోరుతున్నాం. న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కావాల్సిన విధంగా వనరులు ఇవ్వమని కోరాం.

 

అంటే పేరు ఏదైనా.. ఆర్థిక సాయం కావాలని అడిగారా?

ఏంచేస్తారో చేయనివ్వండి. హోదా వస్తే ఏమొస్తాయి? కేంద్ర ప్రా యోజిత పథకాలు, ఎక్స్‌టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు. కేంద్ర ప్రా యోజిత పథకాలు ఇప్పటికే తగ్గిపోయాయి. ఏం చేస్తారో చెప్పండి దానికి అనుగుణంగా మేం చేసుకుంటామని చెబుతున్నాం.

 

హోదా వచ్చినా అనుకున్నంత లాభం జరగదంటారా..?

కేంద్ర ప్రాయోజిత పథకాలు.. నిధులు ఇవ్వలేదనుకో ఏం చేస్తాం? మనం వీటిని గట్టిగా పట్టుకుని ఉంటే.. మీకు ఇచ్చాం పోండి అని చెబితే ఏం చేస్తాం? ఏ పేరుతో ఇస్తారో తెలియదు. ఏపీకి పోటీపడే శక్తి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు కావాలి.

 

అంటే ప్రత్యేకహోదా బంతిని కేంద్రం కోర్టులో వేశారా?

అలా ఏం కాదు. హోదా ఇవ్వాలని కోరా. కాదు అన్నప్పుడు.. మీ రు ఏం చెబుతున్నారని అడిగా.. 13వ షెడ్యూలులో ఉన్నవన్నీ ఇవ్వాలని కోరాం. షెడ్యూలు 10లోని సంస్థల గురించి విన్నవిం చాం. కొందరు కావాలని గందరగోళం చేస్తున్నారు. హోదా అంటే అదొక సంజీవని అని, ఇస్తే అన్నీ అయిపోతాయని చెబుతున్నారు.

 

ప్రత్యేకహోదా డిమాండ్ అయితే వదులుకోలేదు?

హోదా ఇవ్వలేమన్నారు. 14వ ఆర్థిక సంఘం అంటున్నారు. ఇంకొకటి అంటున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి ఏమన్నారంటే.. హోదా వ స్తే ఎంత డబ్బు వస్తుందో అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు.

 

అంటే మీరు దానికి అంగీకరించినట్టేనా?

నేను అంగీకరించడం కాదయా.. మొదట నా డిమాండ్ హోదానే. వారు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారనుకో.. ఇంక బాధేముంది.. నేను కాదనను కదా.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? కొంతమంది మాట్లాడొచ్చు. స్పెషల్ ఇంటెన్సివ్స్ ఎక్కడున్నాయి దాంట్లో? ఏం లాభం వస్తుంది?

 

చట్టంలో ఇంటెన్సివ్స్ ఉన్నాయి కదా?

చట్టాన్ని యథాతథంగా అమలుచేయాలి. చట్టం బయట చెప్పిన హామీలు ఆ స్పిరిట్‌తో అమలుచేయాలి.

 

ఎంత మొత్తం నిధులు వస్తాయి? ప్యాకేజీ మొత్తం ఎంత?

నేనిప్పుడు చెప్పదలుచుకోలేదు. న్యాయపరంగా రావాలి.

 

ప్రధాని ఎలా స్పందించారు?

అన్నింటినీ అమలుచేస్తామన్నారు. నీతి ఆయోగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారు సిఫార్సులు చేస్తారు.

 

మీరు సంతృప్తితో ఉన్నారా? పేరు ముఖ్యం కాదు.. ఆర్థిక సాయం ముఖ్యం అంటున్నారా?

పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి పరచడమే ముఖ్యం. అలా అభివృద్ధి అయ్యేవరకు కేంద్రం సాయం చేయాలి. చట్టభద్రతను అమలుచేయాలి.

 

హోదా ఇవ్వనంటే ఎలా సంతృప్తిచెందారు?

ప్రధాని గంటా 35 నిమిషాలు కేటాయించారు. వాళ్ల అధికారులను రమ్మన్నారు. వాళ్లు కొంత కసరత్తు చేశారు. మా అధికారులు ఉన్నారు. ఆశతో ఉన్నాం. రావాలని కోరుకుంటున్నాం. డిమాండ్‌ను వదులుకోలేదు. సమస్యలు, సెంటిమెంటు,్ల హైదరాబాద్‌లో అవమానాలు వివరించాను.

 

సెక్షన్ 8పైనా ప్రస్తావించారా?

చెప్పాను. సెక్షన్ 8 చట్టంలోనూ ఉంది. పదేళ్ల తర్వాతే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top