మోడీ విషయంలో పునరాలోచనలో పడ్డ 'పెద్దన్న' | US Ambassador to India to meet narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీ విషయంలో పునరాలోచనలో పడ్డ 'పెద్దన్న'

Feb 11 2014 9:30 AM | Updated on Apr 4 2019 5:12 PM

మోడీ విషయంలో పునరాలోచనలో పడ్డ 'పెద్దన్న' - Sakshi

మోడీ విషయంలో పునరాలోచనలో పడ్డ 'పెద్దన్న'

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అమెరికా తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అమెరికా తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ 2005లో మోడీ వీసాను రద్దు చేసిన విషయం తెలిసిందే. తమ వీసా విధానంలో ఎలాంటి మార్పు లేదని అమెరికా ఇన్నాళ్లుగా పదే పదే చెబుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం మోడీని వ్యతిరేకించే విషయంలో అగ్రరాజ్యం పునరాలోచనలో పడింది.

మోడీపై ఇంత కాలం ఉన్న వ్యతిరేకతను అమెరికా పక్కకు పెట్టేసింది. బిజెపి ప్రధాని అభ్యర్ధిగా మోడీ విజయావకాశాలపై సర్వేల రిపోర్టులు చూస్తూ తన వైఖరిని మార్చుకుంటోంది. భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ మోడీతో సమావేశం కానున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీనగర్‌లో ఈ సమావేశం జరుగుతుంది. 

గుజరాత్‌ అల్లర్ల నేపధ్యంలో మోడీకి వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తూ వస్తోంది. అయితే ఇటీవల కోర్టు మోడీకి క్లీన్‌చిట్‌ ఇచ్చిన నేపధ్యంలో అమెరికా తన తీరును మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో మోడీతో కలిసి పనిచేయాల్సి రావచ్చన్న వాస్తవాన్ని గుర్తించే శ్వేత సౌధం క్రమంగా దారిలోకొస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

మోడీ అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దానిపై ప్రస్తుతమున్న నియమ నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా ఇటీవలే అక్కడి అత్యంత ప్రభావవంతమైన 'టైమ్' పత్రిక తన సంపాదకీయంలో మోడీ ప్రధాని అయితే అప్పుడు కూడా వీసా నిరాకరించగలరా అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి నుంచి అమెరికా స్వరంలో కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు మోడీతో భేటీ కూడా అందుకు భాగంగానే భావిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement