
‘అసహనం’ డబ్బు సృష్టి!
భారత్‌లో అసహనంపై జరుగుతున్న చర్చ.. భారీగా డబ్బులు అందుకుంటున్న కొందరి కల్పన అని కేంద్ర మంత్రి వీకే సింగ్ ఆరోపించారు.
కేంద్ర మంత్రి వీకే సింగ్ ఆరోపణ
లాస్ ఏంజెలిస్: భారత్‌లో అసహనంపై జరుగుతున్న చర్చ.. భారీగా డబ్బులు అందుకుంటున్న కొందరి కల్పన అని కేంద్ర మంత్రి వీకే సింగ్ ఆరోపించారు. ‘అసలు ఇది చర్చే కాదు. బిహార్ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రేరేపితంగా వచ్చింది. ఎన్నికలు ముగిశాక అంతా ముగిసిపోయింది’ అని అన్నారు. లాస్ ఏంజెలిస్‌లో ప్రాంతీయ ప్రవాసీ భారతీయ దివస్‌లో ఆయన మాట్లాడారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ చర్చిలో జరిగిన దొంగతనాన్ని చర్చిపై దాడిగా చిత్రీకరించారు. ఓట్ల కోసం ఇలా చేశారు.
మీడియా వంత పాడుతోంది. అందుకు డబ్బులిస్తున్నారో లేదో నాకు తెలియదు’ అన్నారు. అన్ని దేశాల నిఘా భాగస్వామ్యంతోనే ఉగ్రదాడులకు అడ్డుకట్ట వేయగలమన్నారు. కాగా జాతీయవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మాఫియా, తదితరులు సైద్ధాంతిక అహసనాన్ని సృష్టిస్తున్నారని బాబా రాందేవ్ ఢిల్లీలో అన్నారు.