ఏపీకి ఇస్తే మరో 9 రాష్ట్రాలు అడుగుతాయి

ఏపీకి ఇస్తే మరో 9 రాష్ట్రాలు అడుగుతాయి - Sakshi


- ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలుతిరుపతి అలిపిరి/గాంధీరోడ్డు :
భౌగోళిక అంశాలను పక్కనబెట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మరో 9 రాష్ట్రాలు హోదా ఇవ్వాలంటూ ముందుకు వస్తాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై శనివారం తిరుపతిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. సరిహద్దు రాష్ట్రాలు, కొండప్రాంత్రాలు, అధిక శాతం గిరిజనులు, అన్ని విధాల వెనుకబడ్డ.. ఇలా నాలుగు అంశాను ప్రతిపాదికగా తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో వెనకబడ్డ ప్రాంతంకాదని అందు వల్లే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించందన్నారు. తాను ఏపీ నుంచి ఎంపిక కాకపోయినా ప్రాంతీయ అభిమానంతోనే పట్టుబట్టి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చానన్నారు. తాను పట్టుబట్టకపోతే ఇది కూడా వచ్చేది కాదని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ విభజ సహేతుకంగా జరగలేదని, కాంగ్రెస్ అడ్డగోలు విభజన వల్లే ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. రెవెన్యూ లోటును పూడ్చడానికి కేంద్రం సిద్ధంగా వుందని వెంకయ్యనాయుడు చెప్పారు. హోదావల్ల వచ్చేది విదేశీ రుణ ప్రాజెక్టుల కేటాయింపుతో భర్తీ చేస్తున్నామని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా అధికారంలో వున్న కాంగ్రెస్ వల్లే దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. పోలవరం పూర్తి చేయడంలో బీజేపీ విఫలం చెందిందని కాంగ్రెస్ విమర్శిస్తోందని, బిజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందన్నారు. 50 సంవత్సరాల పాటు అధికారంలో వున్న కాంగ్రెస్ పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు కేంద్రం భరిస్తుందని మరో మారు వెంకయ్య స్పష్టం చేశారు. విభజన చట్టంలో ప్రస్థావించని సంస్థలను కూడా ఏపిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.కొందరు ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చడం దారుణమని, డబ్బును ఎవరైన పాచిన లడ్డూలతో పోలుస్తారా అంటూ వెంకయ్య మండి పడ్డారు. భారత సైన్యం విజయం గురించి ప్రస్తావిస్తూ సరిహద్దులను దాటి మూడు కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి పాక్ ఉగ్రవాదులను మట్టుపెట్టిన వైనం సాహసోపేతమైనదని వర్ణించారు. సైనిక చర్యలను యావత్తు దేశం గర్విస్తోందన్నారు. ఈ సందర్భంగా భారతీయజనతాపార్టీ..టీడీపీ కేంద్రమంత్రిని ఘనంగా సన్మానించాయి. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి భారీ వాహన ర్యాలీ వెంకయ్యనాయుడు వెంట తిరుపతి వేదిక వరకూ అనుసరించాయి. రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,కామినేని శ్రీనివాస్,మాణిక్యాలరావు,ఎంఆర్‌పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ,ఎంపీ శివప్రసాద్,శాసనసభ్యులు,బీజేపీ, టీడీపీకి చెందిన పార్టీ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top