లునెస్టా పేటెంట్‌పై డాక్టర్ రెడ్డీస్‌కు చుక్కెదురు | U.S court reverses patent order on Dr. Reddy’s | Sakshi
Sakshi News home page

లునెస్టా పేటెంట్‌పై డాక్టర్ రెడ్డీస్‌కు చుక్కెదురు

Sep 28 2013 12:50 AM | Updated on Apr 4 2019 5:04 PM

లునెస్టా ఔషధం పేటెంటు విషయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కి (డీఆర్‌ఎల్) అమెరికా అప్పీళ్ల కోర్టులో చుక్కెదురైంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లునెస్టా ఔషధం పేటెంటు విషయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కి (డీఆర్‌ఎల్) అమెరికా అప్పీళ్ల కోర్టులో చుక్కెదురైంది. దీనికి సంబంధించి గతంలో డీఆర్‌ఎల్‌కి అనుకూలంగా న్యూజెర్సీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఫెడరల్ సర్క్యూట్ కోర్టు తోసిపుచ్చింది. లునెస్టా జనరిక్ వెర్షన్ తయారీకి డీఆర్‌ఎల్ దరఖాస్తు (ఏఎన్‌డీఏ) విషయంలో పేటెంటు హక్కుల ఉల్లంఘన జరిగినట్లు పేర్కొంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు డీఆర్‌ఎల్ వర్గాలు నిరాకరించాయి.
 
 వివరాల్లోకి వెడితే.. డైనిప్పన్ సుమిటోమో ఫార్మా అనుబంధ సంస్థ సునోవియోన్ .. నిద్రలేమితనం చికిత్సలో ఉపయోగించే లునెస్టా ఔషధాన్ని తయారు చేస్తోంది. ఈ ఔషధం సొంత వెర్షన్లను తయారు చేసేందుకు డీఆర్‌ఎల్ సహా 10 జనరిక్ సంస్థలు చేసిన ఏఎన్‌డీఏ దరఖాస్తులను సవాలు చేస్తూ సునోవియోన్ (గతంలో సెప్రాకోర్) 2009లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, డీఆర్‌ఎల్ ఔషధం రసాయనిక పరంగా భిన్నమైనదని, పేటెంటు హక్కులను ఉల్లంఘించలేదని ఈ ఏడాది జనవరిలో న్యూజెర్సీ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సునోవియోన్ అప్పీళ్ల కోర్టుకు వెళ్లగా తాజా ఆదేశాలు వచ్చాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ ఔషధం అమ్మకాలు ఉత్తర అమెరికా, చైనా మార్కెట్లలో సుమారు 13.6 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు సునోవియోన్ పేర్కొంది.
 
 మరోవైపు, లేబులింగ్ సమస్యల కారణంగా 800 మి.గ్రా. మోతాదు ఐబుప్రూఫెన్ ట్యాబ్లెట్లను డీఆర్‌ఎల్ అనుబంధ సంస్థ అమెరికా మార్కెట్లో నుంచి స్వచ్ఛందంగా రీకాల్ చేస్తోంది. వీటిపై ఎక్స్‌పైరీ తేదీ  10-2016 కాగా 05-2017గా పడటం ఇందుకు కారణం. ఆదాయాలపై ఈ అంశం ప్రభావం పెద్దగా ఉండదని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement