Sakshi News home page

పొగాకు కొనుగోళ్లు జరపాల్సిందే

Published Wed, Jul 1 2015 1:00 AM

పొగాకు కొనుగోళ్లు జరపాల్సిందే

ట్రేడర్లతో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్
నిల్వల కొనుగోళ్లపై మంత్రితో భేటీ అయిన రాష్ట్ర బృందం

 
 సాక్షి, న్యూఢిల్లీ : పొగాకు పంటకు మద్దతు ధరలేక, కొనేవారు లేక తీవ్ర ఇక్కట్లలో ఉన్నామని పొగాకు రైతులు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వద్ద మొరపెట్టుకున్నారు. పలువురు పొగాకు బోర్డు సభ్యులు, రైతులు, కొనుగోలుదారులు, సిగరెట్ తయారీ కంపెనీల ప్రతినిధులు, ఎగుమతిదారులు మంగళవారం నిర్మలాసీతారామన్‌తో సమావేశమయ్యారు. పొగాకు నిల్వలను కొనుగోలు చేయాలని, గత ఏడాది కొనుగోలు చేసిన సగటు ధరకు గానీ, మూడేళ్ల సగటు ధర గానీ చెల్లించాలని కోరారు.

 నిర్ధేశిత మొత్తంలో పొగాకు అవసరమని చెప్పిన తరువాత ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం సరికాదని వాపోయారు. ఈ నేపథ్యంలో నిర్మలాసీతారామన్ కొనుగోలుదారులను గట్టిగా నిలదీసినట్టు సమాచారం. సమావేశం అనంతరం వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏపీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్లు, ధరపై జులై 4న గుంటూరులో జరిగే సమావేశంలో తుది నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఓటుకు కోట్లు కేసు నిందితుడు రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం సంతోషకరమని పుల్లారావు అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement