ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం దుబాయిలో పర్యటించనున్న సందర్భంగా ఆయనతో కలిసి బహిరంగ విందులో పాల్గొనేందుకు భారతీయులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.
దుబాయి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం దుబాయిలో పర్యటించనున్న సందర్భంగా ఆయనతో కలిసి బహిరంగ విందులో పాల్గొనేందుకు భారతీయులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయి స్పోర్ట్స్ సిటీలోని దుబాయి ఇంటర్‌నేషనల్ స్టేడియంలో జరిగే ఈ విందుకు ఏకంగా 50 వేల మంది భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నారని కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. మోదీతో విందుకు హాజరయ్యే అతిథులకు ఉచిత ఆహారం, నీరు అందజేయనున్నారని, ఓపెన్ ఎయిర్ స్టేడియాన్ని సైతం ఎయిర్ కండీషన్‌గా మారుస్తున్నారని 'గల్ఫ్ న్యూస్' పత్రిక పేర్కొంది.
బుధవారం సాయంత్రానికే 48 వేలకు పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని 'నమోఇన్‌దుబాయి.ఏఈ' వెబ్‌సైట్ తెలిపింది. దుబాయిలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకూ ఉంటున్నందున ఒకరోజు ముందు నుంచే స్టేడియాన్ని చల్లబర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ విందుకు మొత్తం 50 వేలకు పైగా మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, చివరగా కనీసం 40 వేల మంది హాజరు కావచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. కాగా మోదీ ప్రధాని హోదాలో తొలిసారి యూఏఈ పర్యటిస్తున్నారు.