దుమారం రేపుతున్న ట్రంప్‌ వ్యవహారం | Temporary visa workers in trump winery | Sakshi
Sakshi News home page

దుమారం రేపుతున్న ట్రంప్‌ వ్యవహారం

Dec 28 2016 5:01 PM | Updated on Aug 25 2018 7:50 PM

దుమారం రేపుతున్న ట్రంప్‌ వ్యవహారం - Sakshi

దుమారం రేపుతున్న ట్రంప్‌ వ్యవహారం

అమెరికా ఉద్యోగాలు విదేశీయులు తన్నుకుపోతున్నారని, వారిని తన్ని తరిమేస్తే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఊదరగొట్టి..

న్యూయార్క్‌: అమెరికా ఉద్యోగాలు విదేశీయులు తన్నుకుపోతున్నారని, వారిని తన్ని తరిమేస్తే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఊదరగొట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్‌ ట్రంప్‌ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వర్జీనియా రాష్ట్రంలో ఉన్న తన వైన్‌ తయారీ సంస్థలోనే తాత్కాలిక వీసాలపై విదేశీ కార్మికులతో పనిచేయించుకుంటున్నారు. ఇదంతా గతమనుకుంటే పొరపాటే. సాక్షాత్తు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్న చార్లాట్స్‌విల్లీ వైన్‌యార్డ్‌ డిసెంబర్‌ 2వ తేదీన ఆరుగురు విదేశీ కార్మికులకు ఆరు నెలల కాలానికి తాత్కాలిక వీసాలను మంజూరు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకుంది.
 
ఈ విషయాన్ని అమెరికా కార్మిక శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేసిందని ‘వాషింఘ్టన్‌ పోస్ట్‌’ పత్రిక వెల్లడించింది. ఇప్పటికే ట్రంప్‌ వైన్‌ తయారీ కేంద్రంలో 19 మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వారికి గంటకు పది డాలర్ల చొప్పున జీతం చెల్లిస్తున్నామని, కార్మికులు 20 గంటల షిప్టులో పనిచేస్తున్నారని కూడా ఆ దరఖాస్తులో కంపెనీ పేర్కొంది. కంపెనీ యజమానిగా విదేశీ కార్మికులను రప్పిస్తూ, స్థానిక కార్మికుల పొట్టకొడుతున్న విదేశీ కార్మికులను దేశం నుంచి పంపిస్తానంటూ ఓ దేశాధ్యక్షుడిగా చెప్పడం ద్వంద్వ ప్రమాణాలు పాటించడమేనని బరాక్‌ ఒబామాకు నైతిక విలువల న్యాయవాదిగా పనిచేసిన నామ్‌ ఐసెన్‌ విమర్శించారు.
 
ట్రంప్‌ తన వ్యాపారాన్నైనా వదులుకోవాలని, లేదా తన కంపెనీ కార్మికులకు తాత్కాలిక వీసాలను మంజూరు చేయడంలో వైట్‌హౌజ్‌ అధికారులు జోక్యం చేసుకోకుండా చూడాలని మిన్నెసోట లా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రిచర్డ్‌ పెయింటర్, ట్రంప్‌కు సూచించారు. 1300 ఎకరాల్లో విస్తరించి ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ వైన్‌ తయారీ కేంద్రం 2014 నుంచి ప్రతిఏటా విదేశీ కార్మికుల వీసాల కోసం దరఖాస్తు చేసి వీసాలు పొందుతూనే ఉంది. గతం వదిలేస్తే ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కూడా ఆరుగురు విదేశీ కార్మికుల వీసాల కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement