టీడీపీ ఎంపీలవి రాజీ‘డ్రామా’లే..

టీడీపీ ఎంపీలవి రాజీ‘డ్రామా’లే.. - Sakshi

సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేశామని ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల అసలు రంగు మరోసారి బట్టబయలైంది. టీడీపీ ఎంపీలు సమర్పించిన రాజీనామాలు ఉత్తుత్తి డ్రామానే అని తేలిపోయింది. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు కూడా డ్రామాలేనన్న అనుమానాలకు బలం చేకూరింది. కొద్ది రోజులుగా రాజీనామాలపై హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలకు ఇప్పుడు ఆ రాజీనామాల ఆమోదం అగ్నిపరీక్షగా మారింది. సీమాంధ్రకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామా వ్యవహారంపై సోమవారం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఆయా ఎంపీల రాజీనామాల అసలు గుట్టు బయటపడింది. కొందరు ఎంపీలైతే అసలు రాజీనామాలే సమర్పించకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేశారన్న విషయం తేలిపోయింది.

 

 సీమాంధ్ర ప్రాంతం నుంచి రాజీనామాలు సమర్పించిన వారుగా.. పది మంది కాంగ్రెస్ (ఎస్.పి.వై.రెడ్డితో కలిపి), ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్, ఒకే ఒక్క టీడీపీ ఎంపీ పేర్లు మాత్రమే స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌లో ఉన్నాయి. వీరిలో సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క మంత్రి పేరూ లేదు. అలాగే రాజీనామాలు సమర్పించిన ఎంపీల వైఖరిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల్లో తనను వ్యక్తిగతంగా కలవాలని స్పీకర్ ఆయా ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇలా కలిసినప్పుడు వారు స్పీకర్ ముందు ఏం చెప్తారన్నది చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఇచ్చే తీర్పుననుసరించి.. రాజీనామాలపై కాంగ్రెస్ ఎంపీల్లోనూ ఎంతమంది చిత్తశుద్ధితో ఉన్నారు? ఎంతమంది డ్రామాలాడుతున్నారు? అన్న అంశం కూడా కొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశముంది. 

 

 అసలు రాజీనామాలే పంపలేదా..?

 రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలన్న డిమాండ్ అన్ని వైపుల నుంచి బలంగా వినిపించింది. ఈ విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో అత్యధికులు మొదటి నుంచి హైడ్రామా నడిపిస్తూ వచ్చారు. టీడీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు చేసిన రాజీనామాలు బూటకమని అధికారికంగా తేలిపోయింది. సోమవారం లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న 13 మంది ఎంపీల్లో టీడీపీ నుంచి కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం) ఒక్కరి పేరు మాత్రమే ఉండటం దీనికి సాక్ష్యం. జూలై 30న సీడబ్ల్యూసీ సమావేశం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు నాలుగైదు లక్షల కోట్లు అవసరమవుతాయని తమ పార్టీ నేతలు అంచనా వేశారని, ఆ మొత్తాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన చంద్రబాబు నివాసంలోనే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

 

  ఆ సమావేశానికి గంట ముందు రాజ్యసభ సభ్యుడు వై.సత్యనారాయణచౌదరి కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించటాన్ని నిరసిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. రాజ్యసభ సభ్యులు వై.సత్యనారాయణచౌదరి, సి.ఎం.రమేష్‌లతో పాటు లోక్‌సభ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి ఉన్నారు. వీరంద రూ తమ రాజీనామా పత్రాలను ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబుకు చూపించగా.. వాటిని లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ చైర్మన్‌కు అందచేయాలని సూచించారు. ఆ మేరకు టీడీపీ ఎంపీలంతా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వారిలో లోక్‌సభ సభ్యులు మోదుగుల, నిమ్మల కిష్టప్ప, ఎన్.శివప్రసాద్‌లు తమ రాజీనామా లేఖలను అసలు స్పీకర్ కార్యాలయానికి గానీ లేదా లోక్‌సభ సచివాలయానికి గానీ పంపలేదు. కొనకళ్ల మాత్రం రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. తాజాగా స్పీకర్ కార్యాలయం నుంచి విడుదలైన బులెటిన్‌తో మిగిలిన ఇద్దరు ఎంపీలు రాజీనామా లేఖలే పంపలేదన్న విషయం బయటపడింది.

 

 ముందే బయటపెట్టిన హరికృష్ణ

 టీడీపీ ఎంపీల రాజీనామాలన్నీ ఉత్తుత్తి రాజీనామాలేనని అదే పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మొద ట్లోనే బయటపెట్టారు. ఆగస్టు 5వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా ఆగస్టు 2వ తేదీనే రాజీనామా చేసినట్టు టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రకటించారు. అయినా పార్లమెంటు సమావేశాలకు హాజరై నానా హడావుడి చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒక ఎంపీ అయితే విజయ్‌చౌక్‌లోని మీడియా పాయింట్ వద్ద చెర్నకోలతో శరీరంపై కొట్టుకున్నారు. రకరకాల వేషాలు ప్రదర్శించారు. ఈ ఎంపీల డ్రామా నడుస్తుండగానే రాజీనామా ఎందుకు ఆమోదం పొందడం లేదో తెలుకోవడానికి స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన హరికృష్ణకు టీడీపీ ఎంపీల రాజీనామాలన్నీ సరిగా లేవని, ఉత్తుత్తి రాజీనామాలని తెలిసి షాకయ్యారు. దాంతో ఆయన వెనువెంటనే మరో రాజీనామా లేఖను అక్కడికక్కడే అందజేసి ఆమోదించాలని స్పీకర్‌ను కోరి మరీ తన రాజీనామాను ఆమోదింపచేసుకున్నారు. 

 

 ఇంత జరిగిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎన్.శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప తాము రాజీనామా చేశామని చెప్పుకుంటూ ఇంతకాలం హైడ్రామా నడిపారు. దాంతో వీరు సమర్పించిన రాజీనామా సరైనపద్ధతిలో లేవని, అవి ఉత్తుత్తి రాజీనామాలేనని హరికృష్ణ మీడియా ముందు బయటపెట్టారు. అయినప్పటికీ వీరు కిమ్మనకుండా యథావిధిగా తమ డ్రామాను కొనసాగించారు. పార్లమెంటు సమావే శాలు ప్రారంభమైన రోజు నుంచి పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే మకాం వేసి ప్రతి రోజూ మీడియా ముందు మాట్లాడుతూ రెండు నెలలుగా హడావుడి చేశారు. తాజాగా స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఒక్క కొనకళ్ల నారాయణ రాజీనామా పత్రం మినహా మిగిలినవి ఏవీ సభాపతి వద్దకు చేరలేదని, లేదా అసలు అవి స్పీకర్ ఫార్మాట్‌లో లేవని బయటపడింది. ఇక టీడీపీ రాజ్యసభ సభ్యులదీ అదే దారి. పార్టీ రాజ్యసభ సభ్యులు సుచనాచౌదరి, సి.ఎం.రమేష్‌లు రాజీనామాలను చైర్మన్‌కు పంపించామని ఆర్భాటంగా ప్రకటనలు చేసినా ఇంతవరకు వాటిని ఆమోదించాలని ఏ రోజూ రాజ్యసభ చైర్మన్‌ను కలిసి కోరలేదు. కోరివుంటే హరికృష్ణ రాజీనామా ఆమోదించిన తరహాలోనే వీరి రాజీనామా కూడా ఆమోదం పొందేది. వీరు తమ రాజీనామా ఆమోదానికి ఏమాత్రం సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

 

 కాంగ్రెస్ కేంద్ర మంత్రుల హైడ్రామా...

 మరోవైపు కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల తీరు కూడా ఇలాగే ఉంది. రాజీనామా డిమాండ్ వచ్చినప్పుడు పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని, సీమాంధ్ర వాణిని వినిపిస్తామని చెప్తూ కొంత కాలం డ్రామా నడిపిన ఎంపీలు ఆ తర్వాత తాము రాజీనామా చేశామని ప్రకటించుకున్నారు. అలాగే మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగుతూ విభజనపై కేంద్రం ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటామని పలువురు సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూవచ్చారు. అసలు కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ రాకుండా చూస్తామని ప్రక టించారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన అంశంపై ఆంటోనీ నేతృత్వంలో కమిటీ నియమిస్తే అది తమ ఒత్తిడి వల్లనేనని చెప్పుకొచ్చారు. 

 

 ఆంటోనీ కమిటీ సభ్యులు రాష్ట్రంలో పర్యటించి అందరితో చర్చిస్తారని, ఆ కమిటీ నివేదిక ఇవ్వకండా తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు రాదని రకరకాల ప్రకటనలతో గంద రగోళపరిచారు. కానీ వారి మాటలకు జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేకుండా పోయింది. కమిటీ రాష్ట్రంలో పర్యటించలేదు సరికదా ఢిల్లీలోనూ రాష్ట్రానికి చెందిన ఏ ముఖ్యమైన వర్గంతోనూ మాట్లాడిన పాపాన పోలేదు. కేవలం మొక్కుబడిగా కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలతో చర్చలకే పరిమితమైంది. ఆ కమిటీ నివేదిక ఇవ్వకుండానే తెలంగాణ నోట్ రూపొందడం, దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ కేంద్రమంత్రులకు తెలిసే జరిగినా తమకు ఏమీ తెలియకుండానే జరిగిపోయినట్లుగా మంత్రులు ఒకటి రెండు రోజులు హడావుడి చేశారు.

 

 వారివీ ఉత్తుత్తి రాజీనామాలే..!

 ఇక మరి కొందరు కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేశామని బయటకు చెప్తున్నప్పటికీ అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. రాజీనామాలు చేశామని ప్రకటించి ఆ మేరకు స్పీకర్‌కు లేఖలు అందించామని కొందరు చెప్తే.. పార్లమెంటు కార్యాలయంలో సమర్పించామని, ఫ్యాక్స్ ద్వారా పంపించామని మరికొందరు ప్రకటించారు. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమైన రాజీనామాలు, ఎన్ని ఉత్తుత్తి రాజీనామాలు అన్న అంశంపై ప్రతి ఒక్కరిలోనూ అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు, సీమాంధ్ర కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలకు, కేంద్రం తెలంగాణపై వేస్తున్న అడుగులకు పొంతన లేకపోవటంతో రాజీనామాలపై వారు చేస్తున్న ప్రకటనలు కూడా ఉత్తుత్తివేనన్న అభిప్రాయం ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమకారుల్లో పాతుకుపోయింది. తాజాగా సోమవారం స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఆ విషయం మరింతగా స్పష్టమవుతోంది. 

 

 స్వచ్ఛందంగానే చేశామని చెప్తారా..?

 ఇంతకాలం స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో రాజీనామాలు చేశామంటూ కొందరు ఎంపీలు హడావుడి చేశారు. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు రావటంతో.. వారు ఇరకాటంలో పడ్డారు. పలువురు ఎంపీలు దానినుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగతంగా స్పీకర్‌ను కలిసినా రాజీనామాలు ఆమోదం పొందకుండా ఉండేలా స్పష్టత ఇవ్వకుండా ఒత్తిళ్ల మేరకు రాజీనామా చేస్తున్నామన్న వివరణ ఇవ్వాలనే వ్యూహంలో ఎంపీలు ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. రాజీనామాలు ఇచ్చామని పైకి చెప్పుకోవటానికి వీలుగా రాజీనామాలు తిరస్కారం కాకుండా స్పీకర్ వద్దనే పెండింగ్‌లో ఉండేలా వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. పలువురు ఎంపీలు తమ రాజీనామాలపై స్పష్టత ఇవ్వటానికి స్పీకర్‌ను మరికొంత గడువు కోరాలన్న ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top