వైఎస్సార్‌సీపీ వాళ్లు కేక్ ఇస్తే తినడం తప్పా?
అంతమాత్రానికే తీవ్రంగా వేధిస్తారా?
చిత్తూరు జిల్లాలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వెల్లడి
బైరెడ్డిపల్లె: ‘నేను తెలుగుదేశం పార్టీకి ఓటేశా.. వైఎస్సార్‌సీపీ నాయకుల జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ఇస్తే తిన్నా... అదేమన్నా తప్పా..? ఇంతమాత్రానికే నాపై అధికార కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడతారా? అయ్యా... ఇక నేను భరించలేను. చచ్చిపోతున్నా...’ అంటూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలోని పాతపేటకు చెందిన శ్రీనివాసులు(42) సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వివరిస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల కథనం మేరకు... పాతపేట గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు, అతని సోదరుడికి మధ్య రెండు రోజుల క్రితం ఘర్షణ జరిగింది. అయితే శ్రీనివాసులును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ నేతల జన్మదిన వేడుకల్లో పాల్గొనడం వల్లే కూటమి నేతలు కక్ష కట్టి పోలీస్‌స్టేషన్‌కు పిలిపిస్తున్నారని గ్రామస్తులు శ్రీనివాసులుకు చెప్పారు.
దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను తెలియజేస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కొందరు కూటమి నేతల వల్లే తాను చనిపోతున్నానని వెల్లడించాడు. ఆ వీడియోను గ్రామస్తులకు షేర్ చేయడంతో అటవీ ప్రాంతానికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులును తొలుత బైరెడ్డిపల్లె పీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


