పుత్తా వర్సెస్‌ రెడ్డెమ్మ | Tension Escalates in Kadapa TDP as Internal Disputes and Leadership Change Discussions Surface | Sakshi
Sakshi News home page

పుత్తా వర్సెస్‌ రెడ్డెమ్మ

Sep 11 2025 11:16 AM | Updated on Sep 11 2025 11:31 AM

 Internal Clashes Between TDP Leaders in Kadapa

పుత్తా వర్సెస్‌ రెడ్డెమ్మ వర్గీయుల బలప్రదర్శన

నూతన బార్‌ ఏర్పాటును అడ్డుకున్న కడప ఎమ్మెల్యే వర్గీయులు

పరస్పర సవాళ్ల నేపథ్యంలో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం

సాక్షి ప్రతినిధి, కడప: కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి పోరు ముదిరింది. కడప కేంద్రంగా పరస్పర బలప్రదర్శనల జోరు ఊపందుకుంది. ఇరుగుపొరుగు నియోజకవర్గాలైన కమలాపురం కడప ఎమ్మెల్యేలు, నేతల మధ్య రగడ తీవ్ర స్థాయికి చేరింది. వరుస వివాదాల నేపధ్యంలో ఏకంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠానికి ఎసరు పెట్టారు. అధ్యక్షుడు మార్పు జరగాల్సిందేనంటూ ఓ వర్గం పట్టుబట్టడం గమనార్హం.

జిల్లా కేంద్రమైన కడపలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కూటమి సర్కార్‌ 16 నెలల కాలంలో తెరపైకి వస్తున్నాయి. ‘మద్యం వ్యాపారం మా వర్గీయులే చేయాలంటూ’ స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు ఆది నుంచి హుకుం జారీ చేయసాగారు. ఫలితంగా ముప్పై ఏళ్లుగా మద్యం వ్యాపారంలో కొనసాగుతు న్న లక్ష్మిరెడ్డికి చెందిన రెండు బార్లు బలవంతంగా స్వాహా చేశారు. తాజాగా 27 బార్ల లైసెన్సుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే 14బార్లకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. మిగతా 13 పెండింగ్‌లో ఉన్నాయి. అందులో జిల్లా కేంద్రమైన కడపలో 4బార్లు పెండింగ్‌లో ఉన్నాయి. 9 టెండర్లలో పలువురికి దక్కాయి. అందులో యల్లటూరు విశ్వనాథరెడ్డికి ఓ బార్‌ దక్కింది.

 కోటిరెడ్డి సర్కిల్‌ సమీపంలో బార్‌ ప్రారంభోత్సవానికి ప్రయత్నించగా..కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఇక్కడ బార్‌ పెట్టొద్దంటూ హంగామా చేశారు. ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఇంతలోనే కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి బ్యానర్లతో కూడిన వాహనాల్లో కొంతమంది అక్కడి చేరు కోవడంతో వాతావరణం వేడెక్కింది. ఇరువర్గాలు పరస్పర సవాళ్లు చేసుకున్నారు. కాసేపటికే అక్కడి నుంచి జారుకున్న కడప ఎమ్మెల్యే వర్గీయులు.. బుధవారం రాత్రి సదరు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నేమ్‌బోర్డును ధ్వంసం చేసినట్లు సమాచారం. కాగా, జిల్లా కేంద్రంలో మాధవి, వాసు నియంతృత్వ పోకడలకు చెక్‌ పెట్టాలనే దిశగా తెలుగుదేశం పార్టీ నేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

పెండింగ్‌లో కడప సిటీ కమిటీ  
టీడీపీ సీనియర్‌ నేతల ఫిర్యాదు మేరకు ఆ పార్టీ కడప సిటీ కమిటీ నియామకం పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. పఠాన్‌ మన్సూర్‌ అలీఖాన్‌ టీడీపీ సిటీ అధ్యక్షుడిగా, జనరల్‌ సెక్రెటరీగా ముక్కెర సుబ్బారెడ్డిలతో కలిసి సిటీ కమిటీ ఏర్పాటుకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి సిఫార్సులు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆ పార్టీలోని సీనియర్లు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో టీడీపీ జెండా మోసినోళ్లు కాదనీ, వేరే పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారిచే సిటీ కమిటీ ఏర్పాటు చేయాల్సిన దౌర్భాగ్యం ఏమిటీ? అని కొందరు నిలదీసినట్లు తెలిసింది. ఏకంగా మంత్రి నారా లోకేష్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో సిటీ కమిటీ నియామకం పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీలో అనైక్యత కొరవడి రగడ తీవ్రస్థాయికి చేరిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

టీడీపీ అధ్యక్ష పీఠానికి ఎసరు
జిల్లా కేంద్రమైన కడపలో ఏకపక్ష చర్యలకు చెక్‌ పెట్టాలని తెలుగుదేశం పార్టీలో కొంతమంది నడుం బిగించారు. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం మార్పు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తోడుగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఉండడంతో ప్రజాస్వామ్య పరిస్థితులను కాలరాస్తున్నారని కొంతమంది టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమేరకు ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ఉదహరించినట్లు తెలుస్తోంది. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులరెడ్డికి రెండు పదవులు ఉన్న నేపధ్యంలో అధ్యక్ష పీఠం తప్పించాలని కోరినట్లు సమాచారం. ఆమేరకు టీడీపీ అధిష్టానం సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా, జిల్లా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందనే అన్వేషణలో జమ్మలమడుగు ఇన్‌చార్జీ చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. టీడీపీలో భూపేష్‌రెడ్డి అందరీకి ఆమోదయోగ్యడుగా నిలువనున్నట్లు అధిష్టానం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement