శ్రీలంక ఉత్తరాది రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన ప్రధాన తమిళ రాజకీయ పార్టీ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
శ్రీలంక ఉత్తరాది రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన ప్రధాన తమిళ రాజకీయ పార్టీ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎల్టీటీఈ ప్రాబల్యం తగ్గాక 25 ఏళ్ల అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో తమిళ్ నేషనల్ అలయెన్స్ (టీఎన్ఏ) సత్తచాటింది. నార్తర్న ప్రావిన్సియల్ కౌన్సిల్ (ఎన్పీసీ) ముఖ్యమంత్రిగా సి.వి.విఘ్నేశ్వరన్ ఎన్నికకావడం లాంఛనమే. తమిళుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలసి తమ పార్టీ పనిచేస్తుందని ఆయన చెప్పారు.
ఐతే ప్రభుత్వంలో తాము చేరబోమని విఘ్నేశ్వరన్ స్పష్టం చేశారు. కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్రంలో పోలీసుల అధికారాలు, భూ సమస్యల గురించి చర్చించనున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో టీఎన్ఏకు తమిళులు మూకుమ్మడిగా మద్దతు పలికారు. 38 స్థానాలకు గాను టీఎన్ఏ 30 సీట్లు గెలుచుకుంది. జాఫ్నాలో పోటీచేసిన విఘ్నేశ్వరన్కు లక్షా 30 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. కాగా శ్రీలంకలో యూపీఎఫ్ఏ అధికారంలో ఉంది. అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఈ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు.