మున్సి‘పల్స్’ తెలిసిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అధికార టీఆర్‌ఎస్ వెంటేనని జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు తేల్చేసిన నేపథ్యంలో...
సాక్షి, హైదరాబాద్: మున్సి‘పల్స్’ తెలిసిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అధికార టీఆర్‌ఎస్ వెంటేనని జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు తేల్చేసిన నేపథ్యంలో ఆ పార్టీలో కొత్త చర్చకు తెర లేచింది. ఇదే ఊపులో గ్రేటర్ పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా వెళ్తే ఎలా ఉంటుం దన్న దిశగా చర్చ జోరుగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా గెలిచి, అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నికకు సిద్ధమయ్యే దిశగా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.
మంత్రి కేటీఆర్ శని వారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీ బస్తీలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రకటన చేయడం, బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో ముస్లిం శ్మశానవాటిక స్థల సేకరణకు వెళ్లి ‘హామీలన్నీ నెరవేరుస్తా’మని ప్రకటించడం అందులో భాగమేనంటున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్‌లో 16 అసెంబ్లీ స్థానాల పరిధిలో టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యత కనబరచడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చినా ‘జీహెచ్‌ఎంసీ’ స్పూర్తితో పనిచేయాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయంటున్నారు.
ఆ ముగ్గురివి కూడా!
సనత్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే కూకట్‌పల్లి, మహేశ్వరం, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు కూడా దానితోపాటే ఉప ఎన్నిక జరిగే అవకాశం లేకపోలేదని టీఆర్‌ఎస్‌లో విన్పిస్తోంది. ఆ పార్టీ ముఖ్యుల్లో శనివారం దీనిపై జోరుగా చర్చ జరిగింది. కూకట్‌పల్లి నుండి మాధవరం కృష్ణారావు, మహేశ్వరం నుండి తీగల కృష్ణారెడ్డి, కంటోన్మెంట్ నుండి సాయన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి, అనంతీరం టీఆర్‌ఎస్‌లో చేరడం తెలిసిందే. ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నారన్న అపవాదును పోగొట్టుకునేందుకు మూడుచోట్లా ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని అధినాయకత్వం సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు కన్పిస్తోందని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు అంగీకరించారు.
‘ప్రజలంతా మా పక్షమేనని తేలినప్పుడు ఈ ఒక్క విష యంలో విపక్షాల విమర్శలను భరించడమెందుకు? అందుకే ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదు’ ఆయన శనివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. కాకపోతే చీటికీమాటికీ ఎన్నికలకు అధినేత కేసీఆర్ విముఖంగా ఉన్నారన్నారు. పైగా ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని తేలాక ఉప ఎన్నికల అవసరం ఏ మేరకన్న కోణంలో కూడా ఆయన ఆలోచించే ఆస్కారం లేకపోలేదని అభిప్రాయపడ్డారు.