breaking news
sub Elections
-
‘ఉప పోరు’కు పోదామా!
సాక్షి, హైదరాబాద్: మున్సి‘పల్స్’ తెలిసిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అధికార టీఆర్ఎస్ వెంటేనని జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తేల్చేసిన నేపథ్యంలో ఆ పార్టీలో కొత్త చర్చకు తెర లేచింది. ఇదే ఊపులో గ్రేటర్ పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా వెళ్తే ఎలా ఉంటుం దన్న దిశగా చర్చ జోరుగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా గెలిచి, అనంతరం టీఆర్ఎస్లో చేరిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నికకు సిద్ధమయ్యే దిశగా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మంత్రి కేటీఆర్ శని వారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీ బస్తీలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రకటన చేయడం, బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో ముస్లిం శ్మశానవాటిక స్థల సేకరణకు వెళ్లి ‘హామీలన్నీ నెరవేరుస్తా’మని ప్రకటించడం అందులో భాగమేనంటున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్లో 16 అసెంబ్లీ స్థానాల పరిధిలో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత కనబరచడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చినా ‘జీహెచ్ఎంసీ’ స్పూర్తితో పనిచేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయంటున్నారు. ఆ ముగ్గురివి కూడా! సనత్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే కూకట్పల్లి, మహేశ్వరం, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు కూడా దానితోపాటే ఉప ఎన్నిక జరిగే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్లో విన్పిస్తోంది. ఆ పార్టీ ముఖ్యుల్లో శనివారం దీనిపై జోరుగా చర్చ జరిగింది. కూకట్పల్లి నుండి మాధవరం కృష్ణారావు, మహేశ్వరం నుండి తీగల కృష్ణారెడ్డి, కంటోన్మెంట్ నుండి సాయన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి, అనంతీరం టీఆర్ఎస్లో చేరడం తెలిసిందే. ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నారన్న అపవాదును పోగొట్టుకునేందుకు మూడుచోట్లా ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని అధినాయకత్వం సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు కన్పిస్తోందని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు అంగీకరించారు. ‘ప్రజలంతా మా పక్షమేనని తేలినప్పుడు ఈ ఒక్క విష యంలో విపక్షాల విమర్శలను భరించడమెందుకు? అందుకే ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదు’ ఆయన శనివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. కాకపోతే చీటికీమాటికీ ఎన్నికలకు అధినేత కేసీఆర్ విముఖంగా ఉన్నారన్నారు. పైగా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని తేలాక ఉప ఎన్నికల అవసరం ఏ మేరకన్న కోణంలో కూడా ఆయన ఆలోచించే ఆస్కారం లేకపోలేదని అభిప్రాయపడ్డారు. -
మెదక్ లోక్‌సభకు కేసీఆర్ రాజీనామా
- ఆర్నెల్లలోపు ఉప ఎన్నిక - ఇంకా ఖరారుకాని టీఆర్ఎస్ అభ్యర్థిత్వం - 29 తర్వాత వెల్లడయ్యే అవకాశం సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ సభ్యత్వానికి టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సోమవారం రాజీనామా సమర్పించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన.. వ్యక్తిగత సహాయకుల ద్వారా లోక్‌సభ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాలలో అఖండ విజయం సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనల మేరకు ఒక అభ్యర్థి రెండు వేర్వేరు స్థానాల నుంచి ఎన్నికల్లో విజయం సాధిస్తే, ఎన్నికైన నాటి నుంచి 18 రోజుల్లో ఒక స్థానానికి రాజీనామాను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేసీఆర్ మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు ఆమోదం లభించడం లాంఛనప్రాయమే. ఆ తర్వాత మెదక్ లోక్‌సభ స్థానంలో ఖాళీ ఏర్పడిందని పార్లమెంటు వ్యవహారాల శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. దీంతో ఆర్నెల్లలోపు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఇదిలా ఉండగా.. ఉప ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నుంచి బరిలో దిగే అభ్యర్థిని ఇంకా టీఆర్ఎస్ ఖరారు చేయలేదు. ఈ నెల 29 తర్వాత అభ్యర్థి ఎంపికపై స్పష్టత రావచ్చని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. -
మెదక్‌పైనే అందరి గురి
ఉప పోరుకు నేతల సై - ఎంపీ స్థానానికి పోటాపోటీ - ముమ్మర ప్రయత్నాల్లో ఆశావహలు - రోజురోజుకు పెరుగుతున్న సంఖ్య - టీఆర్ఎస్లో తీవ్ర పోటీ - బీజేపీలో సైతం అదే తీరు.. - పావులు కదుపుతున్న కిషన్‌రెడ్డి, విజయశాంతి - కాంగ్రెస్, టీడీపీల్లో కానరాని ఆసక్తి సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాల నుంచి బరిలో దిగి విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానానికి కేసీఆర్ త్వరలో రాజీనామా చేయనున్నారు. దీంతో ఆరు నెలల్లో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్, బీజేపీల నుంచి ‘ఉప’ పోరు బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోడానికి భారీ సంఖ్యలో ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఆయా పార్టీల టికెట్‌కు తీవ్ర పోటీ నెలకొని ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్, టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటివరకు ఎవ రూ తమ ఆసక్తిని బహిర్గతం చేయకపోవడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. టీఆర్ఎస్ తరఫున మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఇదే ఊపుతో సునాయాసంగా గెలుపొందవచ్చని ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో కేవీ రమణాచారి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆర్. సత్యనారాయణ, మైనంపల్లి హన్మంతరావు, దేవీప్రసాద్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ వీరిలో ఎవరిని ఆశీర్వదిస్తారేచి చూడాల్సిందే. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ సమీప బంధువుకు జెడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని ఇప్పటికే పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదే జరిగితే మెదక్ లోక్‌సభ నుంచి పోటీలో దింపేందుకు ఆయన పేరును పరిశీలించే అవకాశాలు సన్నగిల్లుతాయి. మూడు పర్యాయాలుగా దుబ్బాక అసెంబ్లీ టికెట్ ఆశించిన కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రతిసారీ భంగపడక తప్పలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్.. కొత్త ప్రభాకర్ రెడ్డికి అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తామని.. ఎమ్మెల్యే హోదాకు మించిన పదవిని ఆయనకు కట్టబెడతానని సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. దీంతో టికెట్ తనకే దక్కవచ్చని ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ను లోక్‌సభ నుంచి బరిలో దింపాలని ఉద్యోగ నేతల నుంచి డిమాండు వినిపిస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి, మల్కాజ్గిరి లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన మైనంపల్లి హన్మంతరావు పేర్లు సైతం ఆశావహుల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు తాజా మాజీ ఎంపీ విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన విజయశాంతి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, వెంకయ్యనాయుడులతో ఉన్న పరిచయాలతో ఆమె బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒక వేళ కిషన్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపకపోతే విజయశాంతికి బీజేపీ టికెట్ దక్కే అవకాశాలున్నాయి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం బీజేపీ టికెట్‌పై మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేసే ఆలోచనతో జనసేన అధినేత పవన్ కల్యాన్‌ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బీజేపీ తెలంగాణ శాఖ అభ్యంతరం తెలపడంతో ఆయన ప్రయత్నానికి ఆదిలోనే చుక్కెదురైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటానని ఉద్ఘాటించారు. సార్వత్రిక పోరులో బీజేపీ నుంచి పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న చాగన్ల నరేంద్రనాథ్ సైతం మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విజయశాంతి బీజేపీ నుంచి బరిలో దిగితే ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, టీడీపీల నుంచి పోటీ చేసేందుకు ఇంతవరకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.