
అమెరికాలో మరో దారుణం.. భారతీయుడిపై కాల్పులు
అమెరికాలో భారతీయులపై వరుసగా జాతి విద్వేషపు దాడులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్: అమెరికాలో భారతీయులపై వరుసగా జాతి విద్వేషపు దాడులు జరుగుతున్నాయి. శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీష్ పటేల్ దారుణహత్యల విషాదం నుంచి కోలుకోకముందే గుర్తు తెలియని దుండగుడు మరో భారతీయుడిపై కాల్పులు జరిపాడు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వాషింగ్టన్ రాష్టంలోని కెంట్ నగరంలో శ్వేతిజాతి దుండగుడు.. మీ దేశానికి వెళ్లిపో అంటూ సిక్కు వ్యక్తి (39)పై ఆయన ఇంటి బయటే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సిక్కు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని కెంట్ పోలీస్ చీఫ్ కెన్ థామస్ చెప్పారు. బాధితుడిని దీప్ రాయ్ గా గుర్తించారు. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది.
దీప్ రాయ్ ఇంటి బయట కారు వద్ద ఉండగా ఓ అపరిచిత శ్వేతజాతి వ్యక్తి ఆయనతో వాదనకు దిగాడు. దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఉన్మాదంతో అరుస్తూ దుండగుడు కాల్పులు జరపగా, దీప్ రాయ్ చేతిలో బుల్లెట్ దూసుకెళ్లింది. దుండగుడు ఆరడుగుల పొడవున్నాడని, ముఖానికి మాస్క్ ధరించాడని దీప్ రాయ్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని కెంట్ పోలీస్ అధికారి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రెంటన్‌లోని సిక్కు సమాజం నాయకుడు జస్మిత్ సింగ్ మాట్లాడుతూ.. దీప్ రాయ్ తో మాట్లాడానని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, ప్రాణాపాయం లేదని చెప్పారు. బాధితుడు, ఆయన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారని, తాము వారికి అండగా ఉంటామని తెలిపారు. ఎఫ్ బీఐ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
మరో విద్వేషపు తూటా!
హైదరాబాద్కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం