బులంద్‌షెహర్ గ్యాంగ్‌రేప్ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్‌ను సుప్రీంకోర్టు మందలించింది.
న్యూఢిల్లీ: బులంద్‌షెహర్ గ్యాంగ్‌రేప్ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్‌ను సుప్రీంకోర్టు మందలించింది. ఈ గ్యాంగ్‌రేప్ ఘటన వెనుక ప్రతిపక్షాల రాజకీయ కుట్ర ఉందన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆజంఖాన్‌ను ఆదేశించింది.
ఈ గ్యాంగ్ రేప్ ఘటన రాజకీయ కుట్ర అని, అఖిలేశ్ సర్కారును బద్నాం చేసేందుకు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆజంఖాన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపంలో ఉండటంతో ప్రతిపక్షాలు ఎంతకైనా దిగజారుతాయని, కాబట్టి ఈ ఘటనలో రాజకీయ కుట్ర ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరుపాలని ఆయన అన్నారు. యూపీలోని బులంద్‌షహెర్ సమీపంలో బందిపోటు దొంగలు ఓ కుటుంబంపై విరుచుకుపడి.. వారి డబ్బు, నగలను దోచుకున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబంలోని పురుషులను తుపాకీతో బెదిరించి.. మహిళ, ఆమె కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్ వ్యాఖ్యలు, పోలీసు దర్యాప్తు తీరును తప్పుబడుతూ బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో కేసు నమోదుచేసింది.