సహరా డైరీలో చంద్రబాబు పేరు! | sahara dairies mention chandrababu name | Sakshi
Sakshi News home page

సహరా డైరీలో చంద్రబాబు పేరు!

Jan 12 2017 10:17 AM | Updated on Sep 2 2018 5:28 PM

సహరా డైరీలో చంద్రబాబు పేరు! - Sakshi

సహరా డైరీలో చంద్రబాబు పేరు!

దేశంలో పెను రాజకీయ దుమారం రేపిన బిర్లా-సహరా డైరీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు కూడా ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు.

న్యూఢిల్లీ: దేశంలో పెను రాజకీయ దుమారం రేపిన బిర్లా-సహరా డైరీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు కూడా ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా కిక్కిరిసిన కోర్టు రూమ్ లో ప్రశాంత్ భూషణ్ సహరా డైరీలలో పేర్లు ఉన్న రాజకీయ నాయకుల వివరాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ పేరు 'గుజ్ సీఎం' (Guj CM), 'మోదీజీ' అంటూ ఈ డైరీలలో పేర్కొని ఉందని పదేపదే భూషణ్ కోర్టులో నొక్కి చెప్పారు. ఈ కేసులో జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, జస్టిస్ అమితావ రాయ్ తో కూడిన ధర్మాసనం ముందు ఆయన వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా కోర్టులో ఉన్న సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖురేషి ఇరకాటంలో పడ్డారు. సహరా డైరీలలో చేతిరాతతో రాసిన ముడుపులు అందుకున్న వారి జాబితాలో ఆయన పేరు నాలుగుసార్లు ఉందని భూషణ్ స్పష్టం చేశారు. దీంతో ఆయన కొంత అసహనంగా కనిపించారు.

2014లో సహరా గ్రూప్ పై జరిపిన ఐటీ శాఖ దాడులలో దొరికిన డైరీలలో రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పిన విషయాలు ఉన్నట్టు వెలుగుచూడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ డైరీలో ఉన్న నాయకుల పేర్లను భూషణ్ కోర్టులో చదువుతూ.. 'సుష్మా స్వరాజ్ జీ, చంద్రబాబుజీ, ములాయం సింగ్ జీ, మాయావతిజీ, ప్రమోద్ జీ కూతురు, శివ్ రాజ్ జీ, రాజస్థాన్, బిహార్ ముఖ్యమంత్రులు, లాలూ జీ, అద్వానీ జీ, రవిశంకర్ జీ, షిండేజీ, ఫరూక్ అబ్దుల్లాజీ, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, దిగ్విజయ్ సింగ్' తదితరుల పేర్లు ఉన్నట్టు తెలిపారు. 'దాదా' అనే పేరు ఈ డైరీలలో నాలుగుసార్లు రాసి ఉంది. కానీ, ఆయన ఎవరు అని ఊహించడానికి కూడా ఎవరూ సాహసం చేయడం లేదు. ఈ కేసుకు 1990నాటి జైన్-హవాలా కేసుకు ఎన్నోరకాలుగా సారూప్యముంది. జైన్-హవాలా కేసులో రాజకీయ నాయకులు పేర్ల ఇనీషియల్స్ ఉండగా.. సహరా డైరీలలో పేర్లు ఉన్నాయి. అప్పట్లో జైన్ -హవాలా కేసులో సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించింది.

అయితే, తాజాగా బిర్లా, సహారా గ్రూపుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నాయకులు ముడుపులు స్వీకరించారంటూ దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా సంస్థల కార్యాలయాలపై ఐటీ శాఖ జరిపిన దాడుల సందర్భంగా లభించాయంటూ.. పిటిషన్‌దారు సమర్పించిన సాక్ష్యాధారాల (డైరీల)కు విచారణార్హత లేదంటూ తోసిపుచ్చింది. ‘మామూలు కాగితాలు, డైరీల్లోని పేజీలు, ఈ మెయిల్‌ ప్రింటవుట్లు,  సాధారణ డాక్యుమెంట్లు సాక్ష్యాలుగా చూపించారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు, విచారణకు ఆదేశించలేం.  అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా ఉన్న పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని బుధవారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అమితవ్‌ రాయ్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది.

సహారా గ్రూప్‌నకు సంబంధించి పిటిషన్‌ దారు కోర్టుకు అందించిన పత్రాలు నిజమైనవి కావనడానికి సాక్ష్యాలున్నాయని ఐటీ శాఖ సెటిల్మెంట్‌ కమిషన్‌ ఇప్పటికే స్పష్టం చేసిందన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా దాఖలవుతున్న పిటిషన్ల విషయంలో సరైన సాక్ష్యాధారాలు లేని పక్షంలో న్యాయప్రక్రియ దుర్వినియోగమయ్యే వీలుందని వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement