రిలయన్స్ గ్యాస్‌లో కొంత ఓఎన్‌జీసీకి చెందిందే | Reliance shares tank on talk of big compensation to ONGC | Sakshi
Sakshi News home page

రిలయన్స్ గ్యాస్‌లో కొంత ఓఎన్‌జీసీకి చెందిందే

Oct 9 2015 2:46 AM | Updated on Sep 3 2017 10:39 AM

రిలయన్స్ గ్యాస్‌లో కొంత ఓఎన్‌జీసీకి చెందిందే

రిలయన్స్ గ్యాస్‌లో కొంత ఓఎన్‌జీసీకి చెందిందే

ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి వేర్వేరు గ్యాస్ క్షేత్రాలను కేటాయించినప్పటికీ.. ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్

న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి వేర్వేరు గ్యాస్ క్షేత్రాలను కేటాయించినప్పటికీ.. ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్ కొంత పక్కనే ఉన్న రిలయన్స్ బ్లాక్‌లోకి వచ్చి ఉండవచ్చని కన్సల్టెన్సీ సంస్థ డీఅండ్‌ఎం పేర్కొన్నట్లు సమాచారం. ఓఎన్‌జీసీకి చెందిన జీ4 బ్లాకు, ఆర్‌ఐఎల్‌కి చెందిన కేజీ డీ6 బ్లాకు పక్కపక్కనే ఉన్నాయి. అయితే, పైకి చూస్తే స్పష్టమైన సరిహద్దులతో ఇవి వేర్వేరుగానే కనిపిస్తున్నా అంతర్గతంగా అనేక మీటర్ల లోతున ఒకే భారీ నిక్షేపం ఉందని, దీనికి సరిహద్దులంటూ లేవని డీఅండ్‌ఎం పేర్కొంది.
 
  ఫలితంగా ఒకే నిక్షేపాన్ని రెండు సంస్థలు పంచుకుంటూ ఉన్నట్లవుతుందని ప్రాథమిక పరిశీలన నివేదికలో డీఅండ్‌ఎం అభిప్రాయపడినట్లు సమాచారం. ఉమ్మడి సరిహద్దులో కావాలనే బావులు తవ్వి తమ నిక్షేపం నుంచి రిలయన్స్ ఉద్దేశపూర్వకంగా గ్యాస్‌ను వెలికితీసిందంటూ 2013లో ఓఎన్‌జీసీ ఆరోపించింది. ఆ దరిమిలా వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు రెండు సంస్థలు కలిసి డీఅండ్‌ఎంను నియమించుకున్నాయి. ఇది ఇరు సంస్థల అధికారులతో పాటు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్‌తో కూడా భేటీ అయ్యింది.
 
 గణాంకాలన్నింటినీ పరిశీలించిన మీదట ఓఎన్‌జీసీకి చెందిన దాదాపు 11.9 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్.. రిలయన్స్‌కి చెందిన కేజీ-డీ6 బ్లాక్ నుంచి బైటికి వచ్చిఉండొచ్చని అంచనా వేసింది. వచ్చే నెలలో డీఅండ్‌ఎం తన నివేదికను సమర్పించనుంది. ఓఎన్‌జీసీకీ ఆర్‌ఐఎల్ ఏమైనా పరిహారం చెల్లించాల్సివుంటుందా అనే నిర్ణయాన్ని చమురు మంత్రిత్వ శాఖ నివేదిక అందిన ఆరునెలల్లోగా తీసుకోవాల్సివుంటుంది. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. డీ అండ్ ఎం నివేదిక ప్రకారం 11.9 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్‌పై ఓఎన్‌జీసీకి రూ. 12,000 కోట్ల పరిహారాన్ని ఆర్‌ఐఎల్ చెల్లించాల్సివుంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement