పార్లమెంటు రణస్థలిగా మారింది | President Pranab Mukherjee addresses the nation on the eve of Independence Day | Sakshi
Sakshi News home page

పార్లమెంటు రణస్థలిగా మారింది

Aug 15 2015 5:40 AM | Updated on Aug 8 2018 6:12 PM

పార్లమెంటు రణస్థలిగా మారింది - Sakshi

పార్లమెంటు రణస్థలిగా మారింది

అర్థవంత చర్చలకు వేదికగా నిలవాల్సిన పార్లమెంటు రణస్థలిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు...

- రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన
- ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతున్నాయి
- దిద్దుబాటు చర్యలకు సమయమిదే
- పార్టీలు ఆలోచించాలి
- వర్షాకాల సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ప్రణబ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:
అర్థవంత చర్చలకు వేదికగా నిలవాల్సిన పార్లమెంటు రణస్థలిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతున్నాయని, వీటి నుంచే దిద్దుబాటు చర్యలు మొదలుకావాలని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. నాయకులు, పార్టీలు దీనిపై ఆలోచించాలన్నారు.  69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రణబ్ శుక్రవారం రాత్రి దూరదర్శన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగం ద్వారా రూపుదిద్దుకున్న సారవంత నేలపై భారత్ గొప్ప ప్రజాస్వామ్యంగా ఎదిగిందని, వేళ్లు బలంగానే ఉన్నా... ఆకులు కళ తప్పుతున్నాయన్నారు.

విలువల పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే భావితరాలు మనల్ని గౌరవించవని అన్నారు. ‘1947లో స్వతంత్ర భారతావనిని కలలుగని, దానికో రూపునిచ్చిన వారిని ఈ రోజు ఎంతో గౌరవిస్తున్నాం. ఆరాధిస్తున్నాం. భావితరాలు మనకు అదే స్థాయి గౌరవమిస్తాయా? సమాధానం అంత సానుకూలంగా ఉండకపోవచ్చు... కానీ ఈ ప్రశ్నను వేయాల్సిందే’ అని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగం మనకిచ్చిన అత్యంత విలువైన బహుమతే ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తికి రాజ్యాంగ వ్యవస్థలే మూలస్తంభాలన్నారు. ఆ విలువలను, వ్యవస్థలను కొనసాగించడమే నిజమైన వారసత్వమన్నారు.

శతాబ్దాల లౌకికవాదాన్ని తుడిచిపెట్టేందుకు, సమాజంలో అలజడిని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని, సమాచార వ్యవస్థ, సాంకేతికత ఎంతో పురోగతి సాధించిన కాలంలో మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఏ కొందరి దుష్ట పన్నాగాలో మన జాతి ఏకత్వాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలన్నారు. చట్టం కంటే కూడా మానవత్వంతో సమాజం రక్షింపబడాలన్నారు. ఈ సందర్భంగా...‘మానవత్వంపై నమ్మకం కోల్పోవద్దు. అదో సముద్రం. అందులో కొన్ని విషపు చుక్కలు కలిసినంత మాత్రాన ఆ సముద్రం కలుషితమైపోదు’ అన్న మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ఉటంకించారు.
 
దేశ సంపద అందరికీ సమానంగా అందాలి

పాటిస్తున్న విలువలు, ఆర్థికాభివృద్ధి, దేశ వనరుల సమ పంపిణీల ఆధారంగానే దేశ పురోగతిని కొలుస్తారని ప్రణబ్ అన్నారు. 2014-15లో వృద్ధిరేటు 7.3కు చేరడంపై సంతోషాన్ని వెలిబుచ్చారు. అభివృద్ధి ఫలాలు అత్యంత సంపన్నుల బ్యాంకు ఖాతాలకు చేరకముందే... పేదలకు అందాలని ఆకాంక్షించారు. సమీప భవిష్యత్తులో ఆకలి కేకలు వినపడని దిశగా మన విధానాలు ఉండాలన్నారు.

మన ఆర్థికరంగం భవిష్యత్తుపై ఎన్నో ఆశలు కల్పిస్తోందని, భారత చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తతరాల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యాసంస్థలు రెట్టింపు అవుతూనే ఉంటాయని... అయితే మునుపటి గురుశిష్యుల అనుబంధాలు, విలువలు ఇప్పుడు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, గురువులు, అధికారులు... ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలని, సమతౌల్యత దెబ్బతింటే ఉత్పాతాలు సంభవిస్తాయని హెచ్చరించారు.
 
సునిశిత ప్రసంగం: మోదీ
సునిశిత దృష్టితో, విస్పష్ట అవగాహనతో రాష్ట్రపతి ప్రసంగం సాగిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రణబ్ ప్రసంగపాఠాన్ని పోస్ట్ కూడా చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కాంగ్రెస్ వైఖరే కారణమని బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలను మోదీ కాంగ్రెస్‌కు గురిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement