అప్పుడు మోదీకి.. ఇప్పుడు నితీశ్‌కు!

అప్పుడు మోదీకి.. ఇప్పుడు నితీశ్‌కు! - Sakshi


పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కుమార్ అద్భుత విజయాన్ని సాధించి వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. ఆయన విజయానికి కారణమైన తెరవెనుక కీలక వ్యక్తుల్లో ఒకరు ప్రశాంత్ కిషోర్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రచారరథాన్ని ముందుకునడిపిన ప్రశాంత్ కిషోర్ ఈసారి నితీశ్‌కుమార్ వెన్నంటి ఉండి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారు. తెర వెనుక ఉండి ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన ఆయన గత మే నెలలోనే రంగంలోకి దిగి.. మరోసారి నితీశ్‌కు సీఎం పీఠం దక్కేలా వ్యూహాలు సిద్ధం చేశారు.నిజానికి ప్రశాంత్ కిషోర్ ఒక ప్రజారోగ్య నిపుణుడు . నరేంద్రమోదీ కోసం ఆఫ్రికాలో ఐక్యరాజ్యసమితి తరఫున చేస్తున్న ఉద్యోగానికి 2011లో రాజీనామా చేసి భారత్ తిరిగొచ్చారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు మోదీ ప్రభుత్వాన్ని మారుపేరుగా జాతీయవ్యాప్తంగా ప్రచారం చేయడంలో కిషోర్‌ కీలక పాత్ర పోషించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వినూత్న రీతిలో సాగించిన ప్రచారానికి రూపకల్పన  చేసింది కిషోరే. ముఖ్యంగా ఆయన రచించిన 'చాయ్‌ పే చర్చ' మోదీకి ప్రచారంలో బాగా కలిసివచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రచార వ్యూహాలకు పదునుపెట్టే ప్రశాంత్ కిషోర్ బృందంలో ప్రధానంగా యువ ఎంబీఏ, ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఉంటారు.ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించడం, విజయం ఖాయమన్న సందోహాన్ని కల్పించడం కిషోర్ ప్రచార వ్యూహాల్లో ప్రధానంగా ఉంటాయి. మోదీకి 'చాయ్‌ పే చర్చ' కార్యక్రమాన్ని రూపొందించిన ఆయన నితీశ్ కోసం 'పర్చా పే చర్చ'ను (పాంఫ్లెట్‌పై చర్చ) తెరముందుకు తెచ్చారు. గత పదేళ్లలో నితీశ్ సర్కార్ పనితీరుపై తమ అభిప్రాయాన్ని తెలుపాల్సిందిగా ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా కోరారు. ఎల్‌ఈడీ మానిటర్లతోపాటు 400 ట్రక్కుల పాంఫ్లెట్లను ఇందుకోసం బిహార్‌లోని అన్ని గ్రామాలకూ పంపారు. ఆయన రూపొందించిన కార్యక్రమాలు ఎన్నికల ప్రచారంలో నితీశ్ నేతృత్వంలోని మహాకూటమికి బాగా కలిసివచ్చాయి.   

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top