కూంబింగ్ పేరుతో ఖమ్మం జిల్లాలో పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ నేతలు ఆరోపించారు.
- మంత్రులు నాయిని, తుమ్మలకు వినతి పత్రం అందజేసిన న్యూడెమోక్రసీ
సాక్షి, హైదరాబాద్: కూంబింగ్ పేరుతో ఖమ్మం జిల్లాలో పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ నేతలు ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 40 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ మేరకు సచివాలయంలో సోమవారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను కలిసి ఒక వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
అక్రమంగా నిర్భందించిన న్యూడెమోక్రసీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల విషయంలో అటవీశాఖ అధికారులు ఉత్యుత్సాహం ప్రదర్శించి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పోడు భూములను గుంజుకోబోమని స్వయంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అధికారులు మాత్రం దాడులను కొనసాగిస్తున్నారన్నారు. పోడు భూముల జోలికి అధికారులు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. మంత్రులను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్దన్, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య ఉన్నారు.