ఎన్నికలకు మోదీ చేతిలో బ్రహ్మాస్త్రం?

ఎన్నికలకు మోదీ చేతిలో బ్రహ్మాస్త్రం? - Sakshi

ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ - కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. అక్కడ ఒకవిధంగా బహుముఖ పోటీ ఉంది. అయినా ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గానీ, బీజేపీ అగ్రనేతలు గానీ పెద్దగా ప్రచారపర్వంలోకి దిగినట్లు కనిపించలేదు. మరి ఇలాంటి తరుణంలో ఐదు రాష్ట్రాల ప్రజలను తమవైపు తిప్పుకోడానికి మోదీ చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది ఏమైనా ఉందా? ఉందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేంద్ర బడ్జెట్‌ను వాయిదా వేయించాలని ప్రతిపక్షాలు కోరినా, ఎన్నికల కమిషన్ మాత్రం ఓటర్లను ఆకట్టుకునే వరాలు ఏవీ ఇవ్వొద్దంటూ కొన్ని షరతులతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. ప్రత్యేకంగా ఆ ఐదు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ భారీగా లబ్ధి చేకూర్చే ఏడో వేతన సంఘం సిఫార్సులను ఈసారి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మాత్రం.. 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు, వాళ్ల కుటుంబ సభ్యులలో అత్యధికులు ఎన్డీయే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. హెచ్ఆర్‌ఏను 138.71 శాతం పెంచాలని, ఇతర అలవెన్సులను 49.79 శాతం పెంచాలని వేతన సంఘం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలుచేయడానికి ఎన్నికల సంఘం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం.

 

పెద్దనోట్ల రద్దుతో నగదు అందుబాటులో లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజలు.. చాలా కాలం నుంచి జీతాలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లు వేతన సంఘం సిఫార్సుల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రకటిస్తే అది కచ్చితంగా ఎన్డీయేకు మేలు చేకూరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 

 

భారం ఎంత?

వేతన సంఘం సిఫార్సులను యథాతథంగా అమలుచేస్తే.. కేంద్ర ప్రభుత్వం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 29,300 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. ఇందులో రూ. 17,200 కోట్లు హెచ్ఆర్ఏ, 12,100 కోట్లు ఇతర అలవెన్సుల రూపంలో పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో భారీగా డబ్బులు డిపాజిట్ కావడం, పన్నుల రూపంలో కూడా ఆదాయం మెరుగుపడటంతో కేంద్రం ఈ సిఫార్సుల అమలుకు మొగ్గు చూపించవచ్చనే అంటున్నారు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top