పాక్ వైమానిక స్థావరంపై ‘ఉగ్ర’దాడి | Pakistan: Taliban storm Peshawar air force base, 33 dead | Sakshi
Sakshi News home page

పాక్ వైమానిక స్థావరంపై ‘ఉగ్ర’దాడి

Sep 19 2015 1:33 AM | Updated on Sep 3 2017 9:35 AM

పాక్ వైమానిక స్థావరంపై ‘ఉగ్ర’దాడి

పాక్ వైమానిక స్థావరంపై ‘ఉగ్ర’దాడి

పాకిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు భద్రతా బలగాలకు గట్టి సవాల్ విసిరారు.

29 మంది మృతి; జవాన్ల ఎదురుదాడిలో 13 మంది మిలిటెంట్ల హతం
పెషావర్: పాకిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు భద్రతా బలగాలకు గట్టి సవాల్ విసిరారు. ఖైబర్ పంక్తూన్‌క్వా రాష్ట్ర రాజధాని పెషావర్ సమీపంలోని బదాబర్ వైమానిక స్థావరంపై శుక్రవారం దాడికి తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 13 మంది ఉగ్రవాదులు పెషావర్‌కు 6 కి.మీ దూరంలో ఉన్న ఈ స్థావరంలో, స్థావరం లోపలి మసీదుపై విచక్షణా రహితంగా కాల్పులు, గ్రెనేడ్ పేలుళ్లకు పాల్పడ్డారు.

ఈ దాడిలో ఒక ఆర్మీ కెప్టెన్, ఇద్దరు సైనికులు, 23 మంది పాక్ వైమానిక దళ సిబ్బంది, ముగ్గురు పౌరులు(మొత్తం 29 మంది) మృతిచెందారు.  భద్రతా బలగాలు ఎదురుదాడి చేసి మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో పదిమంది జవాన్లు సహా 29 మంది గాయపడ్డారు.  ఉగ్రవాదులు పేలుడు పదార్థాల జాకెట్లు ధరించి బృందాలుగా విడిపోయి రెండు మార్గాల్లో ప్రవేశించారు. సెక్యూరిటీ పోస్ట్‌పై దాడి చేసి, అక్కడున్న ఇద్దరు వాయుసేన సాంకేతిక అధికారులను చంపేశారు.

మసీదులో ప్రార్థన చేసుకుంటున్నవారిపై దాడి చేశారు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి, లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించామని ఆర్మీ ప్రతినిధి అసీం బాజ్వా తెలిపారు. స్థావరంలో ఉగ్రవాదులెవరైనా దాక్కుని ఉన్నారేమోనని ఆపరేషన్ సాగిస్తున్నామన్నారు.  సోదాల్లో  ఇప్పటి వరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్  క్షతగాత్రులను పరామర్శించారు. ఈ దాడికి పాల్పడింది తమ ఆత్మాహుతి మిలిటెంట్లేనని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది. మిలిటెంట్లు 50 మంది జవాన్లను చంపేశారని పేర్కొంది. అయితే అధికారులు ధ్రువీకరించలేదు.

బదాబర్ స్థావరం ప్రస్తుతం వినియోగంలో లేదు. వాయుసేన సిబ్బంది, ఉద్యోగులకు నివాస స్థలంగా వాడుతున్నారు. గత డిసెంబర్‌లో పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌పై జరిగిన దాడిలో 150 మంది చనిపోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, పాక్ పంజాబ్ రాష్ట్రంలోని కమ్రా వైమానిక స్థావరంపై దాడికి పన్నిన కుట్రను భగ్నం చేసి, ఒక మానవ బాంబర్‌ను అరెస్టు చేశామని కరాచీ పోలీసులు శుక్రవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement