18% తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం | Sakshi
Sakshi News home page

18% తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం

Published Thu, Aug 8 2013 12:42 AM

18% తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్‌ఎండీసీ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి నికరలాభం 17.51 శాతం క్షీణించి రూ.1,572 కోట్లుగా నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.1,906 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మంచి పనితీరు కనపర్చినప్పటికీ ముడి ఇనుము ధరలు తగ్గడం వల్ల ఆ మేరకు లాభాలు తగ్గినట్లు ఎన్‌ఎండీసీ చైర్మన్ సి.ఎస్.వర్మ తెలిపారు. 
 
 ఈ మూడు నెలల కాలంలో అమ్మకాలు స్వల్పంగా పెరిగి రూ.2,838 కోట్ల నుంచి రూ.2,869 కోట్లకు చేరినట్లు కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీ ఉక్కు పరిశ్రమకు తోడ్పాటును అందించడంపైనే అధికంగా దృష్టిసారిస్తున్నట్లు వర్మ తెలిపారు.
 సెవర్‌స్టల్ ఔట్!: ఛత్తీస్‌గఢ్‌లోని 3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు ఫ్యాక్టరీని సొంతంగానే చేపడుతున్నామని, ఈ ప్రాజెక్టు నుంచి రష్యా కంపెనీ సెవర్‌స్టల్ వైదొలిగినట్లేనని వర్మ ప్రకటించారు.
 
  ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి  2010లో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ సెవర్‌స్టల్ అంతగా ఆసక్తి చూపించడం లేదని, దీంతో ప్రస్తుతానికి సొంతంగానే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో సెవర్‌స్టల్‌కి ఎన్‌ఎండీసీ మెజార్టీ వాటా ఇవ్వనందుకే వెనకడుగువేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఇండియాలో అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌ను ఆపేసినట్లు సెవర్‌స్టల్ ప్రతినిధులు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement