నోట్ల రద్దు దెబ్బకు మూతపడుతున్న పత్రికలు
పెద్ద నోట్ల రద్దు దెబ్బకు ప్రజానికానికి సమాచారం అందించే పత్రికలు సైతం మూతపడుతున్నాయి.
పెద్ద నోట్ల రద్దు దెబ్బకు ప్రజానికానికి సమాచారం అందించే పత్రికలు సైతం మూతపడుతున్నాయి. కేంద్రప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న ఈ రద్దు నిర్ణయంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పత్రికా కార్యకలాపాలు నిర్వహించడానికి డబ్బులు లేక, బలవంతంగా మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. పరిస్థితి సర్దుమణిగి, అన్నీ కరెన్సీ నోట్లు సులభతరంగా చలామణిలోకి వచ్చేంతవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని కాంగ్లా పావ్ డైలీ సంపాదకుడు, యజమాని పోనమ్ లబాంగ్ మన్గ్యాంగ్ తెలిపారు. ప్రకటనదారుల వద్ద కొత్త కరెన్సీ నోట్లు రూ.500, రూ.2000 లేవని, యాజమాన్యాలు పాత నోట్లను తీసుకునేందుకు అంగీకరించడం లేదని మన్గ్యాంగ్ చెప్పారు.
గురువారం అత్యవసరంగా నిర్వహించిన ఆల్ మణిపూర్ న్యూస్పేపర్స్ పబ్లిషర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పత్రికా కార్యాలయాలు మూసివేయాలని అక్కడి యాజమాన్యాలు నిర్ణయించాయి. చట్టపరమైన లావాదేవీలు జరిపే పొజిషన్లో కూడా లేకపోవడంతో గురువారం నుంచి ఆఫీసులు మూతవేయనున్నట్టు ఈ అసోషియన్ ప్రకటించింది. నగదు లేకపోవడంతో న్యూస్పేపర్ షట్టర్స్ సైతం మూతపడుతున్నట్టు పేర్కొంది.
జనవరిలో జరుగుబోయే ఎన్నికల్లో నోట్ల రద్దు దుర్బలమైన ప్రభావం చూపుతుందని, పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని అసలు ఊహించలేమని సీనియర్ బీజేపీ లీడర్ నిమాయిచంద్ లువాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి సరిపడ కరెన్సీని డిమాండ్ చేయడంలో విఫలమవుతుందని విమర్శించారు. అంతేకాక భద్రతా కారణాల ఆదోళనలతో బ్యాంకు శాఖల వద్ద నగదు లావాదేవీలు జరుగడం లేదని లువాంగ్ తెలిపారు. పెట్రోల్ కొనడానికి కూడా తమదగ్గర డబ్బులు ఉండటం లేదని రిపోర్టర్లు చెబుతున్నారు. స్కూల్స్ సైతం ఈ దెబ్బకు మూతపడుతున్నాయి.