
పోలీసులపై నక్సల్స్ మెరుపుదాడి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఓ పోలీసు బృందంపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు
చింతూరు, న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఓ పోలీసు బృందంపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. సుమారు 100 మంది మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఒక ఎస్.ఐ, నలుగురు కానిస్టేబుళ్లను పొట్టనపెట్టుకున్నారు. మావోల కాల్పుల్లో మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని కువాకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నకుల్‌నార్, బచేలిల నడుమ జరుగుతున్న రహదారి నిర్మాణ పనులకు రక్షణ నిమిత్తం కువాకొండ సబ్ ఇన్‌స్పెక్టర్ వివేక్‌శుక్లా ఆధ్వర్యంలో మొత్తం 12 మంది డిస్ట్రిక్ట్ ఫోర్స్(డీఎఫ్) పోలీసులు ఆరు మోటారు సైకిళ్లపై బయలుదేరారు. ఈ క్రమంలో శ్యామ్‌గిరి, ఖుట్‌పార్‌ల నడుమ మాటువేసిన మావోయిస్టులు పోలీసులపై ఒక్కసారిగా కాల్పులకు దిగారు.
హఠాత్పరిణామం నుంచి తేరుకున్న పోలీసులు సైతం కాల్పులు జరపడంతో ఇరువర్గాల నడుమ సుమారు గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఐ వివేక్‌శుక్లాతో పాటు కానిస్టేబుళ్లు సందీప్‌సాహు, ఛవీలాల్ కాశి, ధనేశ్వర్ మండావి, నావల్‌కిషోర్ శాండిల్య అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టుబుళ్లు పుష్పేంద్ర కుమార్, పర్‌దేశీ రామ్, భగీరథీ మండావి గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్ తరలించినట్లు అదనపు డీజీపీ (నక్సల్ ఆపరేషన్) ఆర్.కె. విజ్ తెలిపారు. మరో నలుగురు కానిస్టేబుళ్లు సురక్షితంగా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నట్లు చెప్పారు. కాల్పుల అనంతరం పోలీసులకు చెందిన మూడు మోటారుసైకిళ్లకు నిప్పుపెట్టిన మావోయిస్టులు ఘటనాస్థలి నుంచి ఒక ఏకే-47, రెండు ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులు, 3 ఇంశాస్ రైఫిళ్లు, ఓ వాకీటాకీని ఎత్తుకెళ్లారు. ఘటనకు పాల్పడిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్లు దంతెవాడ ఏఎస్పీ ఎస్‌ఆర్ భగత్ తెలిపారు.