ఒకరికి వస్తే కోపం.. సమూహానికి వస్తే! | Mumbai: Local train services logjam | Sakshi
Sakshi News home page

ఒకరికి వస్తే కోపం.. సమూహానికి వస్తే!

Aug 12 2016 2:23 PM | Updated on Sep 4 2017 9:00 AM

ఒకరికి వస్తే కోపం.. సమూహానికి వస్తే!

ఒకరికి వస్తే కోపం.. సమూహానికి వస్తే!

'ఒకరికి వస్తే కోపం.. అదే కోపం ఒక సమూహానికి వస్తే అది ఉద్యమం' అని ఓ సినిమా డైలాగ్. శుక్రవారం ఉదయం ముంబై శివారులో సరిగ్గా అదే జరిగింది.

ముంబై: 'ఒకరికి వస్తే కోపం.. అదే కోపం ఒక సమూహానికి వస్తే అది ఉద్యమం' అని ఓ సినిమా డైలాగ్. శుక్రవారం ఉదయం ముంబై శివారులో సరిగ్గా అదే జరిగింది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయంటూ ప్రయాణికులు చేపట్టిన ఆందోళన.. నిమిషాల్లోనే ఉధృతంగా మారింది. కొన్ని గంటలపాటు ముంబై ప్రధాన రవాణా వ్యవస్థ కుప్పకూలినట్లైంది.

ముంబై శివారు థానేలోని బదలాపూర్ స్టేషన్ కు ఉదయం 5:30కే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టైం ఏడు గంటలైనా రైలే రాలేదు. అప్పటికే స్టేషన్ జనసమూహంతో కిక్కిరిసిపోయింది. గంటలుగా పేరుకుపోయిన అసహనం ఒక్కసారిగా బద్దలై.. ఆవేశంగా మారింది. అంతా కలిసి స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని నిర్భంధించారు. ఆయనా చేతులెత్తేయడంతో ప్రయాణికుల కోపం తారాస్థాయికి చేరుకుంది. ఒక్కసారిగా అన్ని ట్రాక్ లపైకి దూసుకెళ్లి ఎక్కడి రైళ్లను అక్కడే ఆపేశారు. వారు వెళ్లాల్సిన మార్గాన్నే (బదలాపూర్ ట్రాక్ నే) కాకుండా అన్ని ట్రాక్ లకు అడ్డంగా నిలబడ్డారు. దీంతో కీలకమైన సెంట్రల్ లైన్ (సీఎస్ టీ- కొపొలి) కూడా స్తంభించింది. ఈ కారణంగా ముంబై వ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో 'రైళ్లను పునరుద్ధరిస్తున్నాం.. దయచేసి ఆందోళన విరమించండి' అంటూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రయాణికులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మొత్తానికి ఉదయం 11 గంటలకు బదలాపూర్ స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకగానీ రైళ్ల రాకపోకలు కొనసాగలేదు. ముంబైకర్ల జీవితం లోకల్ రైళ్లలో ఎంతలా ముడిపడి ఉంటుందోనన్న సంగతి తెలిసికూడా రైళ్లను ఆలస్యంగా నడిపితే పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రయాణికులు కూడా కాస్త సంయమనం పాటించి ఉంటే బాగుండేదేమో!


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement