నన్ను ఎవరూ బెదిరించలేరు.. దేవుడు తప్ప

నన్ను ఎవరూ బెదిరించలేరు.. దేవుడు తప్ప


► ఏమవుతుందో వేచి చూడండంటున్న దినకరన్‌

► 21కు పెరిగిన ఎమ్మెల్యేల బలం

► స్పీకర్‌ సంజాయిషీ నోటీసులకు బదులివ్వబోమన్న వెట్రివేల్‌

► చెన్నైకి చేరుకున్న గవర్నర్‌




‘‘ఆపరేషన్‌ ఆరంభం.. ఏమవుతుందో వేచి చూడండి’’ అంటూ టీటీవీ దినకరన్‌ ధీమా వ్యక్తంచేశారు. మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీఎం ఎడపాడికి లేని భయం తమ కెందుకని శనివారం ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరికతో దినకరన్‌ బలం 21కు పెరిగింది. రాష్ట్ర రాజకీయాలు రంజుగా సాగుతున్న వేళ శనివారం సాయంత్రం ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకి చేరుకున్నారు.



సాక్షి ప్రతినిధి, చెన్నై: తీహార్‌ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నాటినుంచి దినకరన్, సీఎం ఎడపాడి మధ్య ఆధిపత్య యుద్ధం నడుస్తోంది. పన్నీర్‌ సెల్వంను కలుపుకోవడం ద్వారా దినకరన్‌ను దెబ్బతీసేందుకు ఎడపాడి సిద్ధమయ్యారు. పన్నీర్‌సెల్వం, ఎడపాడి ఏకం కావడాన్ని సహించలేని దినకరన్‌ తనవర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ఉపసంహరింపజేసి ప్రభుత్వం మైనార్టీలో పడేలా చేశారు. దినకరన్‌ ఎత్తుకు ఎడపాడి పైఎత్తు వేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేరంపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదని 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ద్వారా ఈనెల 24వ తేదీన నోటీసులు జారీచేయించారు.



ఎమ్మెల్యేలు తమ నుంచి ఎడపాడి వైపునకు చేజారిపోకుండా పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో క్యాంపు పెట్టడం ద్వారా దినకరన్‌ జాగ్రత్తలు తీసుకున్నారు. అధికార పార్టీలో అంతర్గత పోరు సాగుతుండగానే గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ముంబయి వెళ్లిపోయారు. మైనార్టీ ప్రభుత్వం వివరాలను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నా«థ్‌ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లాలన్న గవర్నర్‌ ప్రయత్నం వాయిదాపడింది.


పెరుగుతున్న దినకరన్‌ బలం

ఇదిలా ఉండగా, దినకరన్‌ శిబిరంలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరడంతో బలం 21కి పెరిగింది. తటస్త వైఖరి అవలంభిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. 8మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు తమకు అండగా ఉన్నారని, మరో రెండు రోజుల్లో తమకు మద్దతు ప్రకటించనున్నారని శశికళ తమ్ముడు దివాకరన్‌ శనివారం ప్రకటించారు. స్పీకర్‌ నోటీసులు తమకు అందలేదు, ఒకవేళ అందినా తాము బదులిచ్చేది లేదని ఎమ్మెల్యే వెట్రివేల్‌ స్పష్టంచేశారు. రెండు రోజుల్లోగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రపతిని కలుస్తామని పుదుచ్చేరి క్యాంప్‌లోని ఎమ్మెల్యే తంగతమిళ్‌ సెల్వన్‌ శనివారం అల్టిమేటం ఇచ్చారు.



రోజురోజుకూ మారుతున్న బలాబలాలు

అసెంబ్లీలో బలాబలాలు రోజురోజుకూ మారిపోతూ అంకెల గారడిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో అన్నాడీఎంకేకి 134మంది ఎమ్మెల్యేలున్నారు. దినకరన్‌ వైపు 21 మంది నిలవడం వల్ల ఎడపాడి బలం 122 నుంచి 113కి పడిపోయింది. బలపరీక్ష నుంచి గట్టెక్కాలంటే మరో నలుగురు అవసరం. నోటీసుల జారీ ప్రకారం 19 మందిపై స్పీకర్‌ అనర్హత వేటు వేస్తే అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 134 నుంచి 115కు పడిపోతుంది. డీఎంకేకి మిత్రపక్షాలను కలుపుకుని 98 మంది ఉన్నారు. ఈ లెక్కన మ్యాజిక్‌ ఫిగర్‌ 117 లేకున్నా సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా ఎడపాడి ప్రభుత్వం గట్టెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.



నన్ను ఎవరూ బెదిరించలేరు..

‘‘నన్ను ఎవరూ బెదిరించలేరు.. ఒక్క దేవుడు తప్ప..’’ అని దినకరన్‌ శనివారం వ్యాఖ్యానించారు. గవర్నర్‌ మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే పార్టీలో ఆపరేషన్‌ మొదలైంది, వేచి చూడండి ఫలితాలు ఎలా ఉంటాయో అని దీమా వ్యక్తంచేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు పుదుచ్చేరిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తున్నారు.



ఉప ఎన్నికలు వస్తే డీఎంకేతో ముప్పు

ఎడపాడి ఎత్తుగడ అసలుకే ముప్పులా మారుతుందనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో అన్నాడీఎంకేలోని అంతర్గత కుమ్ములాటలు డీఎంకే లాభించేలా మారగలదు. అసెంబ్లీలో డీఎంకేకి 89, మిత్రపక్ష కాంగ్రెస్‌కు 8, ఇండియన్‌ ముస్లిం లీగ్‌కు ఒకటి కలుపుకుంటే ప్రతిపక్షానికి మొత్తం 98 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 19 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఖాళీ అయితే 6 నెలల్లోగా ఉపఎన్నికలు నిర్వహించాలి.



జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కేనగర్‌ కూడా ఖాళీగా ఉంది. ముఠా కుమ్ములాటలతో అన్నాడీఎంకే ప్రతిష్ట దిగజారిన పరిస్థితుల్లో డీఎంకే వైపు ఓటర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు జరిగే 20 స్థానాలు డీఎంకే ఖాతాలోకి చేరితే ప్రతిపక్ష బలం 118కి చేరుకుంటుంది. సీఎం ఎడపాడి కంటే బలమైన పక్షంగా ప్రతిపక్షం ఎదుగుతుంది. ఏ కోణంలో చూసినా ఎడపాడి ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందనే అనుమానాలు నెలకొన్నాయి.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top