
అయ్యో! నా బిడ్డకు 22 ఏళ్లే!
అది పశ్చిమబెంగాల్ లోని ఓ మారుమూల గ్రామం. అక్కడ ఓ జంట తమ బిడ్డ కడసారి చూపు కోసం కన్నీరుమున్నీరవుతూ.. కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తోంది.
అది పశ్చిమబెంగాల్ లోని ఓ మారుమూల గ్రామం. అక్కడ ఓ జంట తమ బిడ్డ కడసారి చూపు కోసం కన్నీరుమున్నీరవుతూ.. కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తోంది. చేతికి అందివచ్చిన చెట్టు అంత బిడ్డ ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందడంతో తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చడం గ్రామస్తులు ఎవరి వల్ల కావడం లేదు. ముష్కర దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాను డీ దలియా (22) తల్లిదండ్రుల విషాదమిది.
జమ్ముకశ్మీర్ లోని యూరిలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 18 మంది సైనికుల్లో దలియా ఒకరు. ఆ వీరజవాను కడసారి చూపుకోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు మీడియా మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 'నా కొడుకు వయస్సు 22 ఏళ్లే. ఇప్పటికీ జూనియర్ జవాను. సాధారణంగా సీనియర్ జవాన్లను పంపేచోటికి నా కొడుకు ఎందుకు పంపించారు' అంటూ తండ్రి ప్రశ్నించారు. తల్లి మాట్లాడుతూ 'గురువారం నా కొడుకు ఫోన్ చేశాడు. మాపై బాంబులు వేస్తున్నారు. మమ్మల్ని వారు చంపుతున్నారు. మేం వెళ్లిపోతున్నామని చెప్పాడు' అని చెప్పింది. మహారాష్ట్రలోని అమరావతిలో కూడా జవాను యుకే జన్ రావు (27) కడసారి చూపు కోసం కుటుంబసభ్యులు విషాదంలో ఎదురుచూస్తున్నారు. యూరి ఉగ్రవాద దాడిలో మరణించిన 18మంది సైనికుల కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.