పారిశ్రామిక వెనకడుగు

పారిశ్రామిక వెనకడుగు - Sakshi


- రాష్ట్రంలో తిరోగమనంలో పారిశ్రామిక రంగం.. కొత్తవి రాలేదు.. పాతవి మూత

- గత జనవరిలో రూ.28 కోట్లతో విశాఖలో పార్టనర్‌షిప్ సమ్మిట్

- రూ. 4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలంటూ ప్రచారం

- ‘సన్‌రైజ్ వెలుగులు’ అంటూ ఆర్భాటం.. ఒక్క పెద్ద కంపెనీ కూడా రాలేదు

- రెండేళ్ల నుంచి తగ్గుతున్న పారిశ్రామిక విద్యుత్ వినియోగం

- ముఖ్యమంత్రి చంద్రబాబు 16 విదేశీ పర్యటనలు చేసినా కనిపించని ఫలితాలు

- ఆర్టీఐ చట్టం ద్వారా బయటపడ్డ టీడీపీ సర్కారు ప్రచార బండారం

- 2017లో మరో రూ.ఏడు లక్షల కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం!

 

 సాక్షి, అమరావతి: కొత్త పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గడిచిన రెండున్నర ఏళ్లలో ఒక భారీ ప్రాజెక్టును కూడా ఆకర్షించకపోగా ఉన్న పరిశ్రమలే మూతపడుతున్నాయి. రాష్ట్రంలో తగ్గుతున్న పారిశ్రామిక విద్యుత్ వినియోగమే ఇందుకు నిదర్శనం. ఈ రెండేళ్లలో విశాఖపట్నం నుంచి హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ వెళ్లిపోగా, మన్నవరంలోని బీహెచ్‌ఈఎల్‌కు చెందిన విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రం కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. వాస్తవ పరిస్థితులిలా ఉండగా రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువంటూ ప్రభుత్వం భారీ ప్రచారానికి తెర తీస్తోంది.అబద్ధపు ప్రచారాలతో మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జనవరిలో విశాఖపట్నంలో ఆర్భాటంగా నిర్వహించిన పార్టనర్‌షిప్ సమ్మిట్ ఘోరంగా విఫలమైందని ఆర్‌టీఐ చట్టం ద్వారా వెలుగు చూసింది. ఈ సమ్మిట్ ద్వారా రూ. 4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలు కుదుర్చుకొని ‘రాష్ట్రంలో సన్‌రైజ్ వెలుగులు’ అంటూ భారీగా ప్రచారం చేసింది. కానీ ఇదంతా కేవలం ప్రచారమేనని, వాస్తవ రూపంలో ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షులు నాదెండ్ల మనోహర్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే.. పదినెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్ట్ రాలేదని ప్రభుత్వమే అధికారికంగా వివరణ ఇవ్వడం గమనార్హం.ఈ సమ్మిట్ పెద్ద బోగస్‌అని, దీని ద్వారా ప్రభుత్వం రూ.28 కోట్లు ప్రజాధనాన్ని వ్యయం చేసిందని మనోహర్ తెలిపారు. ఈ ఒప్పందాల వల్ల పది లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, కానీ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఇప్పుడు ప్రభుత్వమే చెపుతోందన్నారు. ఈ ప్రచారం మరిచిపోకముందే  వచ్చే ఏడాది మరో రూ.7 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఇప్పటి నుంచే భారీ ప్రచారానికి ప్రభుత్వం తెర తీయడం విశేషం. పరిశ్రమలకు తగ్గిన విద్యుత్తు వినియోగం

 రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు మూత పడుతున్నాయనడానికి విద్యుత్ వినియోగమే ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రంలో గడచిన రెండేళ్ళలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 14 శాతం మేర తగ్గింది. అవిభక్త రాష్ట్రంలో (2014కు ముందు) ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 13 జిల్లాల్లో ఏటా 24,090 మిలియన్ యూనిట్ల మేర డిమాండ్ ఉండేది. 2015-16లో (మార్చి 16 నాటికి) ఇది 20,718 మిలియన్ యూనిట్లకు తగ్గింది. వాస్తవానికి 2016-17 సంవత్సరంలో పరిశ్రమలకు 31,356.22 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ఈ అంచనాలతో పోలిస్తే ప్రస్తుత వాస్తవ డిమాండ్ చాలా తక్కువగా ఉంది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల విద్యుత్ వినియోగం 2018 మిలియన్ యూనిట్లకు పడిపోయింది.వందకుపైగా పరిశ్రమల్లో కొన్ని మూతపడగా, మరికొన్ని పాక్షికంగా పనిచేయడం మానేశాయి. గ్రానైట్ ఆధారిత పరిశ్రమల్లో 128 వరకూ మూతపడటం వల్ల ఏటా 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. ఫుడ్‌ప్రాసెసింగ్, ఫార్మా కంపెనీల్లో సంక్షోభం వల్ల 900 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ పడిపోయింది. దాదాపు 18 భారీ పరిశ్రమల విద్యుత్ వినియోగం తగ్గింది. దీనివల్ల మరో వెయ్యి మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. అయితే శ్రీసిటీతో పాటు విశాఖలో కొన్ని ప్రతిపాదిత పరిశ్రమల్లో స్వల్పంగా విద్యుత్ వినియోగం పెరిగింది. అయినప్పటికీ పడిపోయిన విద్యుత్ డిమాండ్‌ను చేరుకునే పరిస్థితి లేదు. 220 కేవీ పరిశ్రమలకు ఈ ఏడాది ఏడు వేల మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇది ఇప్పటివరకూ 500 ఎంయూ దాటలేదు. దీన్నిబట్టి భారీ పరిశ్రమలు ఏ ఒక్కటీ రాలేదని స్పష్టమవుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నట్లుగా పరిశ్రమల పురోగతి ఏ మార్గంలోనూ కనిపించడంలేదని తేటతెల్లం అవుతోంది. కనీసం విమాన ఖర్చులు కూడా రాలేదు

 గత రెండున్నరేళ్లలో వివిధ దేశాలు, కంపెనీలతో సుమారు రూ.6 లక్షల కోట్లకు పైగా విలువైన పెట్టుబడి ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఒక్క విశాఖలో జరిగిన ‘సన్‌రైజ్ ఏపీ’ ఇన్వెస్టర్ల మీట్‌లోనే రూ.4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలు చేసుకుంది. మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు 16 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. 76కుపైగా పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క భారీ ప్రాజెక్టును కూడా ఆకర్షించలేక పోయారు. కనీసం ఈ విమాన ప్రయాణ ఖర్చులకు సమానమైన ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని ఒక అధికారి వ్యాఖ్యానించాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘సన్‌రైజ్ ఏపీ’ పేరిట ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సదస్సు కేవలం ప్రచారానికే పరిమితమైపోయింది. ఒప్పందాలన్నీ ప్రచార ఆర్భాటాలుగానే మిగిలిపోయినట్లు అధికారిక లెక్కలే చెపుతున్నాయి.► రూ.30,000 కోట్ల భారీ ప్రాజెక్టు పెట్టడానికి ముందుకొచ్చిన ఆస్ట్రేలియాకి చెందిన క్వీన్స్ లాండ్ కోల్ కార్పొరేషన్ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్-వైజాగ్ స్టీల్) రూ. 38,500 కోట్ల విస్తరణ పనులకు సంబంధించి పనులు కూడా అటకెక్కాయి. ప్రస్తుతం ఉక్కు పరిశ్రమ అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో విస్తరణ పనులకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

► దక్షిణాదిలో ప్లాంట్ పెడతానన్న హీరో మోటార్ కార్ప్‌కు ఉచితంగా భూమి ఇచ్చి మరీ ఆకర్షించినా.. అది కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులకు కంపెనీలు ఎంవోయూలు చేసుకుంటున్నాయే కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా పునాదిరాళ్ల స్థాయిని కూడా దాటలేదని ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.

► 2020 నాటికి ఐటీ రంగంలో రూ.40,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది 2014లో ఆర్భాటంగా విడుదల చేసిన ఐటీ పాలసీ లక్ష్యం. కానీ ఈ పాలసీ విడుదలై రెండున్నర ఏళ్లు గడుస్తున్నా చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్టూ రాలేదు. చివరకు తెలంగాణ ‘టి హబ్’కు పోటీగా ప్రవేశపెట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఏపీలో విఫలమైంది. నో ఈజ్ ఆఫ్ డూయింగ్

 ఆన్‌లైన్‌లో అన్ని అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటివి కేవలం మాటలకే పరిమితమయ్యాయని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం అన్ని అనుమతులు 21 రోజుల్లో మంజూరు చేస్తామని రాష్ట్రం ఘనంగా ప్రకటించిందని, కానీ ఈ సమయంలో కేవలం 6-7 అనుమతులు మాత్రమే వస్తున్నాయని మిగిలినవి ఆరు నెలలు దాటినా రావడం లేదని ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ ముత్తవరపు మురళీకృష్ణ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో ఘనంగా పాలసీలను ప్రకటిస్తున్నారే కానీ వీటికి సంబంధించి జీవోలు విడుదల కాకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో భారీ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనేకమార్లు టెండర్లు పిలిచినా ఒక్క విదేశీ సంస్థ కూడా ముందుకు రావడం లేదంటే పాలసీలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొత్త రాష్ట్రం కావడం వల్ల మౌలిక సదుపాయాల కల్పనలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం డెరైక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. కొత్త రాష్ట్రం కావడం వల్ల పెట్టుబడిదారులు కొంత ఆలోచించడం సహజమేనని, విదేశీ సంస్థల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

 

 ప్రత్యేక హోదా రాకపోవడంతో...

 రాష్ట్రంలో కొత్తగా పెట్టే పరిశ్రమలకు ప్రకటించిన రాయితీలు సకాలంలో చెల్లించకపోవడం కూడా పెట్టుబడులు రాకపోవడానికి మరో కారణంగా ఉంది. రాష్ట్ర ఖజానా లోటులో ఉండటం, ఇస్తానన్న రాయితీలు చెల్లించకపోతుండటంతో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర రాయితీలతో సంబంధం లేకుండా కేంద్ర రాయితీలను చూసైనా పెట్టుబడులు వస్తాయనుకుంటే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రత్యేక హోదా వస్తే ఇన్‌కమ్ ట్యాక్స్, సేల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ సుంకాల్లో, విద్యుత్తు, రవాణాలో రాయితీలు వస్తాయన్న ఆశతో చాలామంది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ మిన్న అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాహాటంగా అంటుండటం పారిశ్రామిక వర్గాలను కుదేలయ్యేలా చేస్తున్నాయి.కేంద్రం కూడా ప్రత్యేకహోదా లేదని స్పష్టం చేయడంతో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ కూడా ఒక యూనిట్‌ను పెడదామనుకున్నామని, కానీ అది రాకపోవడంతో ఇప్పుడు గుజరాత్‌లో యూనిట్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రముఖ నిర్మాణ రంగ తయారీ పరిశ్రమ ప్రతినిధి చెప్పడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. అలాగే రాష్ట్రంలో భూముల ధరలు, మౌలికవసతుల లేమి పరిశ్రమల ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారాయని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా భూమిని కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదని పేరు రాయడానికి ఇష్టపడని ఒక పారిశ్రామికవేత్త చెప్పారు.

 

 అంకెల్లో పెట్టుబడుల హామీలు


► విశాఖ సీఐఐ ఇన్వెస్టర్ల మీట్‌లో రూ. 4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలు

► రెండేళ్లలో 267 సంస్థలు కలసి రూ. 1.46 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నాయి

► పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇప్పటివరకు సీఎం 16 సార్లు విదేశీ పర్యటనలు

► చైనా నుంచి రూ.58,000 కోట్లు, జపాన్ నుంచి రూ.50,000 కోట్ల ఒప్పందాలు

► వచ్చే ఏడాది సీఐఐ పార్టనర్ సమ్మిట్ ద్వారా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యమంటున్న ప్రభుత్వం

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top