ఓ బాలికపై ఐదేళ్ల పాటు లైంగిక అఘాయిత్యాలకు పాల్పడిన ఓ భారతీయుడికి అమెరికా కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
న్యూయార్క్: ఓ బాలికపై ఐదేళ్ల పాటు లైంగిక అఘాయిత్యాలకు పాల్పడిన ఓ భారతీయుడికి అమెరికా కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 13 ఏళ్ల చిన్నారిని లైంగికంగా వేధించడమే కాకుండా, నీలి చిత్రాల వీడియోలను కలిగి ఉన్నట్లు 50 ఏళ్ల నరేంద్ర తులసీరామ్పై అభియోగాలు గతేడాది ఏప్రిల్లోనే రుజువయ్యాయి. తాజాగా మన్‌హట్టన్ కోర్టు అతడికి శిక్షను ప్రకటించింది. అలాగే, అతడిపై జీవితకాల పర్యవేక్షణకు ఆదేశించింది.
నరేంద్ర మళ్లీ ఇతరులకు హానిచేయకుండా ఈ శిక్ష నిరోధిస్తుందని న్యూయార్క్ దక్షిణ జిల్లా అటార్నీ ప్రీత్ భరారా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధిత బాలికపై తులసీరామ్ ఐదేళ్లపాటు దారుణాలకు పాల్పడడంతో పాటు వాటిని ఫొటోలు తీశాడు. చివరికి 2011లో బాలిక ఎదురు తిరగ్గా సదరు చిత్రాలను కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించడం మొదలుపెట్టాడు. బాలికతో అసభ్యకరంగా ఉన్న చిత్రాలను అతడి సెల్‌ఫోన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.