గత కొన్నాళ్లుగా మెరుపు కోల్పోయిన బంగారం మళ్లీ తళుక్కుమంటోంది. సమీప కాలంలో పుత్తడి ధరలు మరింత పుంజుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి తీవ్ర పతనం కారణంగా ఆర్‌బీఐ చేపట్టిన చికిత్స చర్యలే దీనికి కారణంగా నిలుస్తున్నాయి. ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) కట్టడి కారణంగా అటు స్టాక్ మార్కెట్, ఇటు బాండ్ మార్కెట్ కూడా ‘బేర్’మంటోంది. దీంతో షేర్లు, బాండ్ల నుంచి ఇన్వెస్టర్లు తమ రూట్‌ను మార్చుకుంటున్నారు. మళ్లీ బంగారంలో పెట్టుబడులకు మక్కువ చూపుతున్నారనేది నిపుణుల అభిప్రాయం.
పుత్తడికి ‘పండుగే’...
నెల రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో ఘోరంగా కుప్పకూలిన బంగారం ధర మళ్లీ శరవేగంగా పుంజుకుంది. ఒకానొక దశలో ఔన్స్ పసిడి 1,120 డాలర్లదాకా పడిపోయి... తిరిగి ప్రస్తుతం 1,310 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను ఈ ఏడాది నుంచే తగ్గించడం మొదలుపెడుతుందనే అంచనాలతో డాలరు బలం పుంజుకొని.. బంగారం పెట్టుబడుల్లో అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. అయితే, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకున్న సంకేతాలు అందాకే ప్యాకేజీల కోత ఉంటుందని ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ ఇచ్చిన వివరణతో బంగారం మళ్లీ కొంత రికవరీ అయింది.
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధర కోలుకుంటోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) గత శుక్రవారం రూ.435 ఎగబాకి రూ.28,665 వద్ద స్థిరపడింది. ఇక ఢిల్లీలో కూడా రూ.28,800కు చేరింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఈ నెలనుంచే మొదలవనుండటం కూడా పసిడికి మళ్లీ గిరాకీ పెరిగేందుకు దోహదం చేయనుంది. ఈ నేపథ్యంలో ధర త్వరలోనే మళ్లీ కీలకమైన రూ.30,000 స్థాయికి చేరడం ఖాయమంటున్నారు బులియన్ డీలర్లు. దేశీ మార్కెట్లో బంగారానికి భారీ డిమాండ్ కొనసాగుతుందని జియోజిత్ కామ్‌ట్రేడ్ హోల్‌టైమ్ డెరైక్టర్ సీపీ కృష్ణన్ అన్నారు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం రేటు 1,340 డాలర్ల పైన కొనసాగితే... మళ్లీ 1,500 డాలర్ల స్థాయిని అందుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
రూపాయి ఎఫెక్ట్ కూడా...
డాలరుతో రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోవడం కూడా బంగారం ధరల కదలికపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు ఘోరంగా పడిన సమయంలో రూపాయి బలహీనత కారణంగా దేశీ మార్కెట్లో మరీ అంత వేగంగా దిగజారలేదు. ఇప్పుడు విదేశీ మార్కెట్లో పసిడి జోరందుకుంటుండటం... మరోపక్క, రూపాయి విలువ సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టాలకు జారిపోవడంతో దేశీయంగా బంగారం మెరుపులు మెరిపిస్తోంది.
పుత్తడి దిగుమతి కోసం గతంతో పోలిస్తే ఎక్కువ రూపాయిలను చెల్లించాల్సిరావడమే దీనికి కారణం. శుక్రవారం రూపాయి ముగింపులో కొత్త ఆల్‌టైమ్ కనిష్టాన్ని(61.10) నమోదు చేసింది. గత నెల ఇంట్రాడేలో నమోదైన కనిష్టస్థాయి 61.21కి చేరువైంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి అటు ఆర్‌బీఐ లిక్విడిటీ కట్టడి చర్యలు, ఇటు ప్రభుత్వం ఎఫ్‌డీఐల ఆకర్షణపై దృష్టిపెట్టినప్పటికీ పెద్దగా ఫలితం చేకూరడంలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో స్టాక్స్, బాండ్ల కంటే ఇప్పుడు బంగారమే మళ్లీ సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారని చెబుతున్నారు.
స్టాక్‌మార్కెట్లకూ రూపాయి సెగ...
‘ఒకపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతుండటం... రూపాయి పతనం నేపథ్యంలో బంగారంవైపు దృష్టి పెరుగుతోంది. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే భారతీయులు సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇక పసిడిని మాత్రమే ఎంచుకుంటారు’ అని ఇన్వెస్ట్‌కేర్ డెరైక్టర్ సమర్ విజయ్ వ్యాఖ్యానించారు. గత వారంలో అంతర్జాతీయ మార్కెట్లు జోరుగానే ఉన్నప్పటికీ.. దేశీ స్టాక్‌మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగింది. శుక్రవారం సెన్సెక్స్ మరో 154 పాయింట్లు కోల్పోయి 19,164 వద్ద స్థిరపడింది. ఎనిమిది రోజుల్లో ఏకంగా 1,138 పాయింట్లు(5.61%) సెన్సెక్స్ నష్టపోయింది.
రూపాయి విలువ అడ్డూఅదుపూలేకుండా కొత్త కనిష్టాలకు పడిపోతుండటమే స్టాక్‌మార్కెట్లను కుదిపేస్తోంది. దీనికి అడ్డుకట్టవేయడం కోసం ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు మార్కెట్లను మరింత దెబ్బతీశాయి. దీనికితోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాల బాటలోనే కొనసాగుతుండటం కూడా షేర్లకు శరాఘాతంగా మారుతోంది. ఎఫ్‌ఐఐలు స్టాక్స్, బాండ్లలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో మళ్లీ బంగారమే మంచి రాబడులందిస్తుందన్న భరోసాతో ఇన్వెస్టర్లు అటువైపు దృష్టిపెడుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.