పశ్చిమ గోదావరి జిల్లాలో గరగపర్రు ఘటన దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు.
కామవరపుకోట: పశ్చిమ గోదావరి జిల్లాలో గరగపర్రు ఘటన దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. మాజీ సర్పంచ్ కె.వెంకటరెడ్డి మృతిచెందడంతో ఆయన కుటుంబీకులను పరామర్శించేందుకు మండలంలోని ఆదివారం జలపవారిగూడెం వచ్చిన నాని విలేకరులతో మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గరగపర్రులో పర్యటించి ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు కృషిచేయడంపై రాష్ట్రవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేశారన్నారు.
పార్టీ నాయకులతో జగన్ ఒక కమిటీ ఏర్పాటు చేశారని, తమ పార్టీ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతి కమిటీతో సమన్వయం చేసుకుంటూ గ్రామంలో సామరస్యపూర్వక, శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈనెల 8, 9 తేదీల్లో జరిగే వైఎస్సార్‌సీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి జిల్లా నుంచి లక్షలాదిమంది కార్యకర్తలు తరలి వెళతారన్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు, తదితరులు ఉన్నారు.