ఫీజుల్లేని పాఠశాల..! | Sakshi
Sakshi News home page

ఫీజుల్లేని పాఠశాల..!

Published Mon, Oct 5 2015 7:49 PM

ఫీజుల్లేని పాఠశాల..! - Sakshi

అంధ, బదిర పిల్లల అభివృద్ధే ధ్యేయంగా, సమాజంలో వారికి మంచి గుర్తింపు రావాలన్నదే ఆశయంగా ఓ పాఠశాల పాటుపడుతోంది. వ్యక్తిగత అనుభవాలను రంగరించి విద్యాబోధనకు జోడించి వారి భవితకు సహకరిస్తోంది. పరీక్షలు మార్కులే ధ్యేయంగా పోటీ తత్తంలో నిర్వహిస్తున్న పాఠశాలలున్న నేటి తరుణంలో... ఇబ్బడి ముబ్బడి ప్రవేశాలకు దూరంగా... ఒక్క రూపాయి కూడ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఆ విద్యాలయం కొనసాగుతోంది. 1998 లో ఆచార్య రకుమ్ స్థాపించిన ఆ సంస్థ.. నేడు ఎంతోమంది పౌరులను దేశానికి అందిస్తోంది.

ఆచార్య శ్రీ రకుమ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్... బెంగళూరులో 1998 లో స్థాపించి ప్రస్తుతం మూడు శాఖలను నిర్వహిస్తోంది. ఎటువంటి ప్రభుత్వ, విదేశీ సంస్థలనుంచీ ఆర్థిక సాయం ఆశించకుండా... పిల్లలకు ఉచిత శిక్షణతోపాటు, ఆహారం, దుస్తులు, వృత్తి శిక్షణ అందిస్తోంది. ప్రజల సహాయ సహకారాలతో విద్యార్థులను తమ స్వంత పిల్లలుగా సాకుతోంది. ప్రస్తుతం ఆరు వందలమంది విద్యార్థులతో ఆ విద్యాలయం దిన దిన ప్రవర్థమానమౌతోంది.

మారు మూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలనుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ చేరుతుంటారు. ఎటువంటి ఆర్థిక సాయం లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలో ప్రతిరోజూ తమకు అవసరమయ్యే సబ్బులు, షాంపూలు, పాలు వంటి వస్తువుల జాబితాను విద్యార్థులు బ్లాక్ బోర్డ్ పై రాసి బయట పెడతారు. స్థానిక ప్రజలు, దయ కలిగిన వారు బోర్డును చూసి స్పందించి వారికి తోచిన సహాయం అందిస్తుంటారు. మిగిలిన అవసరాలు మాత్రం పిల్లల జీవిత పోరాటంలో భాగమేనని నిర్వాహకుడు రకుమ్ చెప్తారు. 1988 లో రికార్డు నెలకొల్పిన కరాటే ఛాంపియన్ రకుమ్. పలురకాల విద్యల్లోనూ ప్రావీణ్యం ఉన్న ఆయన... జపనీస్ సహా పలు భాషల్లో మాట్లాడగలడు. నేచురోపతి వైద్యంలో కూడ ప్రావీణ్యం కలిగిన వాడు.

విద్యార్థులను ఉన్నత స్థితికి తెచ్చే ప్రయత్నంతోపాటు, వారికి మార్షల్ ఆర్ట్స్ లో కూడ తర్ఫీదునిస్తున్నారు. సెలవుదినాల్లో వంట, కార్పెంటరీ, ప్లంబర్ వర్క్, ఎలక్ట్రికల్ రిపేర్లు నేర్పిస్తున్నారు. ఎనిమిదో తరగతి దాటిన పిల్లలకు  సైక్లింగ్, డ్రైవింగ్ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. జీవితంలో వారు ఏ పరిస్థితిలోనైనా ధీమాగా బతకగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాఠశాల వయసునుంచే వారికి అందిస్తున్నారు.

ఇప్పటికే ఆ పాఠశాలలో ఎంతోమంది యోగాలో ప్రావీణ్యం పొంది, కరాటేలో బ్లాక్ బెల్ట్ పొంది ప్రపంచంలో ఎక్కడైనా తమ విద్యను వినియోగించుకునే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో చదివిన పిల్లలు సివిల్ సర్వెంట్స్ అవ్వాలన్నది పాఠశాల నిర్వాహకుడు రకుమ్ ఆకాంక్ష.  అందుకే విద్యార్థులకు ఆరోక్లాసునుంచే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. గత నెలలో ఈ పాఠశాలలో చదివిన ముగ్గురు విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష కూడ రాశారు.

అయితే ఈ పాఠశాలలో ఇటీవల పిల్లల అవసరాలు తీరడం కొంత కష్టంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో బ్లాక్ బోర్డుపై తమ అవసరాలను రాసే విద్యార్థులు, ఇప్పడు ఫేస్ బుక్ పేజీల్లో కూడ పెడుతున్నారు. దీనికి స్పందించి అందించిన సహాయంతో కాలం గడుపుతున్నారు. ఇటువంటి పిల్లల బాధ్యత తన ఒక్కడిదే కాదని, సమాజానికి కూడ బాధ్యత ఉందని రకుమ్ అంటున్నారు. అయితేనేం అనుకున్నది సాధించేందుకు రకుమ్ పాటు పడుతున్నారు. దయగలవారెవరైనా ఇటువంటి పిల్లల ఎదుగుదలకు తోడ్పడాలని సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement