ఆర్జేడీ అధ్యక్షుడు, యూపీఏ కీలక భాగస్వామి లాలూప్రసాద్ యాదవ్ భవితవ్యం ఇవాళ తేలనుంది.
రాంచీ : ఆర్జేడీ అధ్యక్షుడు, యూపీఏ కీలక భాగస్వామి లాలూప్రసాద్ యాదవ్ భవితవ్యం ఇవాళ తేలనుంది. దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి పీకే సింగ్ సోమవారం తుది తీర్పు వెలువరించనున్నారు. ఈ కేసులో లాలు దోషిగా నిరూపితమైతే ఆయనకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని సమాచారం. అదే జరిగితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం లాలూపై అనర్హత వేటు పడే ప్రమాదముంది.
లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంలో లాలూ, అప్పటి మంత్రి జగన్నాధ్‌మిశ్రా, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సహా పలువురు వ్యక్తులు... దాదాపు 38 కోట్లు స్వాహా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చైబాస జిల్లా ట్రెజరీ నుంచి ఈ భారీ మొత్తాన్ని డ్రా చేశారని వాదనలు వినపించాయి. ఈ కుంభకోణంపై సీబీఐకేసు నమోదు చేయడంతో లాలూ 1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో మొత్తం 56మందిని నిందితులుగా పేర్కొనగా విచారణ సమయంలో ఏడుగురు మరణించారు. ఇద్దరు అప్రూవర్గా మారగా.... ఒకరికి కేసు నుంచి విముక్తి లభించింది.