
సహకారం పెంపొందాలి
భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య బంధం మరింత బలపడాలని, కొత్త కొత్త రంగాల్లో పరస్పర సహకారం విస్తృతం కావాలని
భారత్-ఇజ్రాయెల్ సంబంధాలపై సుష్మాస్వరాజ్
జెరూసలెం: భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య బంధం మరింత బలపడాలని, కొత్త కొత్త రంగాల్లో పరస్పర సహకారం విస్తృతం కావాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో జరిగిన భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. స్థానిక భద్రతలో వినూత్న ఆలోచనలు, సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అన్నట్లుగా ఈ రెండు దేశాల మధ్య బంధానికి ఆకాశమే హద్దు కావాలన్నారు.
రెండు దేశాల భాగస్వామ్యంలో సరికొత్త భవిష్యత్తును దర్శించాలని, భద్రత, వినూత్న ఆవిష్కరణలు, విద్య, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల సహాయ, సహకారాలను విస్తృతపర్చుకోవాలన్నారు. ఆర్థిక సంబంధాలే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలపరుస్తాయని ఆమె చెప్పారు. పెట్టుబడులు, తయారీ, సేవల రంగాల నుంచి మేక్ ఇన్ ఇండియా వైపు కదిలామని మంత్రి తెలిపారు. నెతన్యాహు, ఇతర ఇజ్రాయెల్ నాయకులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో ఉన్నతమైన సంబంధాలను కొనసాగించాలని భారత్ భావిస్తోందని ఆమె స్పష్టం చేశారు.
ఇరు దేశాల ప్రజలను ఉద్దేశించి సుష్మ మాట్లాడుతూ భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పౌర సమాజాలు, పార్లమెంటేరియన్స్, మహిళా సంక్షేమం వంటి అంశాల్లో అభిప్రాయాలను పరస్పరం పంచుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ కీలకపాత్రను పోషిస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న దేశాల్లో భారత్, ఇజ్రాయెల్ ఉన్నాయనే విషయాన్ని గమనించాలన్నారు. భారతీయులు కష్టజీవులని ఆమె అభివర్ణించారు.